New Study on Smoking and Tobacco Use : స్మోకింగ్ చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఎన్నిసార్లు చెప్పినా దానిని పట్టించుకోరు. దానివల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పినా.. అస్సలు లెక్క చేయరు. అయితే స్మోక్ చేస్తూ మానేయడం వల్ల అనేక అనర్థాలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ధూమపానం మానేయడం వల్ల కేవలం మూడు సంవత్సరాల తర్వాత ఆయుష్షు విషయంలో పెను మార్పులు చూస్తారంటూ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. మరి ఆ అధ్యయనం ఏమిటో? దానిలో తేలిన విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
స్మోకింగ్ మానేస్తే..
యూనిటీ హెల్త్ టొరంటోలోని యూనివర్శిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు స్మోకింగ్‌పై కొత్త అధ్యయనం చేశారు. NEJM ఎవిడెన్స్‌లో ప్రచురించిన ఓ అధ్యయనంలో భాగంగా నలభై ఏళ్లలోపు స్మోకింగ్ మానేసిన వారు.. ఎప్పుడూ ధూమపానం చేయని వారితో సమానంగా జీవించగలరని ఈ అధ్యయనం చూపిస్తుంది. ఏ వయస్సులోనైనా స్మోకింగ్ విడిచిపెడితే వారు పది సంవత్సరాలు తర్వాత ఎప్పుడూ ధూమపానం చేయని వారికి వయస్సుకు దగ్గరగా జీవిస్తారని కనుగొన్నారు. అయితే దీనిలో మార్పులను మీరు మూడేళ్లలోనే గుర్తించగలరని నిరూపించింది ఈ అధ్యయనం.
అద్భుతమైన ఫలితాలు
మరణాల ప్రమాదాన్ని తగ్గించడంలో ధూమపానం మానేయడం వల్ల ప్రభావవంతమైన ఫలితాలు పొందుతారని తెలిపారు. ఈ ప్రతి ఫలాన్ని చాలా త్వరగా పొందగలరని తెలిపారు. స్మోకింగ్ చేస్తే ఆరోగ్యం పాడై ప్రాణాలు పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లంగ్స్ ప్రాబ్లమ్ వచ్చి ఎందరో క్యాన్సర్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆయుష్షు రేటు తగ్గిపోతుంది. అదే స్మోకింగ్ అలవాటు ఉన్నవ్యక్తి దానిని మానేస్తే మాత్రం ఎన్నో అద్భుతమైన ఫలితాలు పొందవచ్చునని తాజా అధ్యయనం తెలిపింది.
వారిలో మరణ రేటు ఎక్కువ
ఈ అధ్యయనంలో నాలుగు దేశాల ప్రజలు పాల్గొన్నారు. యూఎస్, యూకే, కెనడా, నార్వే ప్రజలపై 15 సంవత్సరాలు ఈ అధ్యయనం చేశారు. ఎప్పుడూ ధూమపానం చేయని వారితో పోలిస్తే 40 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న ధూమపానం చేసేవారు చనిపోయే ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువని తెలిపారు. అంటే సగటున వారు 12 నుంచి 13 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయారు. ఎప్పుడూ ధూమపానం చేయనివారితో పోలిస్తే.. ధూమపానం చేసి మానేసిన వారిలో మరణ ప్రమాదాన్ని తగ్గుతున్నట్లు గుర్తించారు.
ఎన్నో ఏళ్లుగా స్మోకింగ్ చేస్తున్నాను.. ఇప్పుడు మానేయడం ఆలస్యం అయిందేమో అనుకుంటున్నారా? అయితే మీరు కచ్చితంగా ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయకండి. మీరు మానేయాలనుకుంటే అది ఏ సమయంలోనైనా మంచిదే. అది మీ ఆయుష్షును కచ్చితంగా పెంచుతుంది. కాబట్టి ఆలస్యమైందని ఎప్పుడూ ఆగిపోకండి అంటున్నారు. మీరు ఎప్పుడూ దానిని మానేసినా.. ప్రభావం వేగంగా ఉంటుందని తాజా అధ్యయనం తెలిపింది. మెరుగైన జీవన నాణ్యత కోసం మీరు స్మోకింగ్ చేస్తున్నా.. దానిని మానేస్తే అద్భుతమైన బెనిఫిట్స్ పొందవచ్చు.
Also Read : అలోవెరా జ్యూస్‌తో ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో.. అలా తీసుకుంటే ఇంకా మంచిదట
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.