Telangana Assembly: మాజీ మంత్రి, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డికి పలు సూచనలు చేశారు. రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ఆయన సీఎంగా కొనసాగాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ నుంచి అయితే రేవంత్‌కు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కాంగ్రెస్ నేతలతోనే ఆయన జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను, రేవంత్ రెడ్డి ఒకే స్కూల్‌లో చదువుకున్నామని, ఆయన తన జూనియర్ అని కడియం శ్రీహరి గుర్తు చేశారు. రేవంత్‌కు మద్దతుగా నిలుస్తూ కడియం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బడ్జెట్ సమావేశాల సందర్భంగా నేడు అసెంబ్లీలో కడియం శ్రీహరి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నుంచి రేవంత్‌కు ఏ రకమైన ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్లతోనే ఆయనకు ఇబ్బందులు తప్పవని అనిపిస్తోందంటూ కడియం కీలక వ్యాఖ్యలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో సమాధానం చెప్పాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జారీ చేసిన నోటిఫికేషన్లు కాకుండా కొత్త 2 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలని కడియం డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో తాము పూర్తి చేసిన నియామకాలను తమవిగా కాంగ్రెస్ సర్కార్ చూపించుకుంటుందని ఆరోపించారు. కృష్ణా, గోదావరి జలాలపై ప్రభుత్వం ప్రవేశపెట్టే శ్వేతపత్రంపై జరిగే చర్చలో తాము పాల్గొంటామన్నారు. సభలో రేవంత్ రెడ్డి మాట్లాడే భాష సరిగ్గా లేదని, దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన సీఎం పదవిలో ఉన్నప్పుడు అసెంబ్లీలో సహనం కోల్పోయి పరుష పదజాలం మాట్లాడటం మంచి పద్దతి కాదని రేవంత్‌కు కడియం సూచించారు.
అలాగే అసెంబ్లీలో తనపై పరుష పదజాలం ఉపయోగించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కడియం మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డిలా మాట్లాడి రేవంత్ రెడ్డి పరువు తీసుకోవద్దని హితవు పలికారు. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా ఎన్ని విషయాలైనా మాట్లాడవచ్చని, కానీ అసెంబ్లీలో ఆచితూచి మాట్లాడాలని సూచించారు. అటు రాజగోపాల్ రెడ్డి నిండుసభలో తనపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేదా స్పీకర్ స్పందించి రికార్డుల నుంచి తొలగించాలని కడియం కోరారు. కాంగ్రెస్ పార్టీని మోసం చేసి నాశనం చేసిన చీడపురుగు రాజగోపాల్ రెడ్డి అని కడియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యుల మధ్య మాటల యుద్దంతో అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా నడిచాయి. కాంగ్రెస్ నేతల ఘాటు వ్యాఖ్యలను ఖండిస్తూ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ సభ్యులు బైఠాయించారు.
తమను మీడియా పాయింట్ వైపు వెళ్లనీయకపోవడంపై కేటీఆర్, హరీష్ రావు మండిపడ్డారు. ఎందుకు తమను అనుమతించడం లేదని పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దిగారు. ఇవేమి కొత్త నిబంధనలు అంటూ అసెంబ్లీ ప్రాంగణంలో కూర్చోని నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా ఏడు రోజులుగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూాటాలు పేలుతున్నాయి.