ఆన్‌లైన్లో కొనేటప్పుడు అన్నీ పెద్దగానే కనిపిస్తాయి. అలాగని పెద్దగా ఉంటాయని మాత్రం అర్థం కాదు. కొనేముందు ఆ వస్తువు తాలూకు ఎత్తు, బరువు, పొడవు, వెడల్పులు వంటివి డిస్క్రిప్షన్లో చదువుకోవాలి. అప్పుడే దాని పరిమాణం ఎంతో మీకు అర్థమవుతుంది. చాలా మంది రేటుని బట్టి సైజు అంచనా వేస్తారు. ఇప్పుడు పిల్లల బొమ్మలు కూడా వందల రూపాయలు ఉంటున్నాయి. ఓ మహిళ ఇలాగే కేవలం ధర చూసి వస్తువు పెద్దగానే ఉంటుందని అనుకుంది. తీరా డెలివరీ అయ్యాక చూస్తే గట్టిషాకే తగిలింది. అసలేమైందంటే...
మరియం అనే మహిళ న్యూయార్క్‌లో నివసిస్తోంది. ఆమె ఆన్ లైన్ షాపింగ్ చేస్తుంటే ఓ కుర్చీ కనిపించింది. చూడటానికి చాలా అందంగా ఉంది. వెల్వెట్ క్లాత్‌తో, బంగారు వర్ణం రంగులోని కాళ్లు, అంచులతో రాజరికం ఉట్టిపడేలా ఉంది. దాన్ని చూడగానే మరియం మనసు పారేసుకుంది. రేటు కూడా కాస్త ఎక్కువగానే ఉంది. తన ఇంటి అందాన్ని మరింత పెంచుకోవడం కోసం దాన్ని ఆర్డర్ ఇచ్చింది. ఆ కుర్చీ వచ్చాక ఎక్కడ పెట్టాలో ఆలోచించి, ఇంట్లో ఉన్న పాతకుర్చీ తీసి బయటపడేసింది. డెలివరీ రోజు రానే వచ్చింది. డెలివరీ బాయ్ చిన్న ప్యాకెట్ తెచ్చి ఇచ్చాడు. అది చూశాక మరియంకు ఏమీ అర్థం కాలేదు. ఓపెన్ చేస్తే ఇంకేముందు కుర్చీయే కాకపోతే పిల్లలు ఆడుకునే బొమ్మ ఛైర్ వచ్చింది. అది చూశాక మరియంకు మామూలు షాక్ కొట్టలేదు. ఒకసారి తాను ఆర్డర్ ఇచ్చిన కుర్చీ తాలుకు వివరాలు ఈ కామర్స్ సైట్‌లో మళ్లీ వెతికింది. అప్పుడర్ధమైంది ఆమెకు తాను చేసిన తప్పేంటో.
నిజానికి ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్లో ఆమె మోసపోయింది ఏమీ లేదు. సరిగ్గా డిస్క్రిప్షన్ చదవకుండా కొనడం వల్ల సమస్య వచ్చింది. ఆ కుర్చీ కింద వివరాలలో టోయ్ ఛైర్ అని ఉంది. అలాగే పొడవు, వెడల్పులు కూడా ఇచ్చారు. అయినా మరియం చూడకుండా అది పెద్ద కుర్చీ అనుకుని ఆర్డరిచ్చింది.
ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో వీడియో రూపంలో చెప్పింది. తాను ఊహించిన కుర్చీ, తనకు వచ్చిన కుర్చీ అని చెప్పి రెండు ఫోటోలను పెట్టింది. అది చూసి తెగనవ్వుకున్నారు నెటిజన్లు. ‘ఇలా కూడా జరుగుతుంది, కొనేముందే జాగ్రత్తగా మనమే చూసుకోవాలి’ అని టిక్ టాక్‌లో ఆమె పోస్టుకు కామెంట్లు వస్తున్నాయి. ‘మన కళ్లు మనల్నే మోసం చేయడమంటే ఇదే’ అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.
Also read: డైజెస్టివ్ బిస్కెట్లు ఆరోగ్యానికి మంచివా? వాటి గురించి చదివాక మీరే నిర్ణయించుకోండి
Also read: వాడేసిన టీ బ్యాగులు పడేస్తున్నారా? వాటితో ఇంట్లో ఇన్ని పనులు చేసుకోవచ్చు