సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య, నటుడు శరత్ కుమార్... కోలీవుడ్ ప్రముఖులు ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. తాజాగా కరోనా బారిన పడిన ప్రముఖుల జాబితాలో వీరిద్దరూ చేరారు. సోషల్ మీడియాలో వేర్వేరుగా... తమకు కరోనా అని వీళ్లిద్దరూ పోస్టులు చేశారు.


ఐశ్వర్య విషయానికి వస్తే... జాగ్రత్తలన్నీ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడినట్టు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు. దయచేసి మాస్క్ ధరించమని, వ్యాక్సిన్ వేయించుకోమని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాదో (2022) తనకు ఇంకేం తీసుకొస్తుందో ఎదురు చూస్తానని చెప్పడం కొసమెరుపు. ఈ ఏడాదే ధనుష్, తాను విడిపోతున్నట్టు ఐశ్వర్య ప్రకటించిన సంగతి తెలిసిందే. ధనుష్ కూడా అదే విధంగా ప్రకటన చేశారు. అయితే... ఆమె ఆస్పత్రి పాలు కావడంతో త్వరగా కోలుకోవాలని రజనీకాంత్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు.


శరత్ కుమార్ విషయానికి వస్తే... తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ట్వీట్ చేశారు. హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నట్టు తెలిపారు. గత వారం నుంచి తనను కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోమని కోరారు.