ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... మార్చి 11న 'రాధే శ్యామ్' సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల చేయనున్నట్టు ఈ రోజు ఉదయం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఓ పోస్ట్ చేశారు.


"విధిరాతకు, ప్రేమకు మధ్య జరగబోయే భారీ యుద్ధాన్ని మార్చి 11న థియేటర్లలో చూడండి. ఆ రోజు థియేటర్లలో కలుద్దాం" అని ప్రభాస్ పేర్కొన్నారు. 


'ఆర్ఆర్ఆర్' కంటే ముందే 'రాధే శ్యామ్' థియేటర్లోకి వస్తుందని, మార్చి 11న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ... నేడు ప్రభాస్ విడుదల తేదీని వెల్లడించారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజులుగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందనే ప్రచారం జరిగింది. గతంలో వాటిని ఖండించారు. మరోసారి వాటికి చెక్ పెడుతూ... థియేటర్లలో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 


ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా... కృష్ణంరాజు, సచిన్ ఖేడేకర్, భాగ్య శ్రీ, మురళీ  శర్మ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించిన 'రాధే శ్యామ్' సినిమాను గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్ పతాకాలపై వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌ నిర్మించారు. హిందీలో టీ - సిరీస్ నిర్మాణ భాగస్వామి. ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. దక్షిణాది భాషల్లో పాటలకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు అందించగా...  మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ హిందీలో పాటలకు స్వరాలు అందించారు.