మైగ్రేన్ అనగానే తలనొప్పే కదా అనుకుంటారు, ఈ నొప్పి భరించడం కష్టంగా ఉంటుంది. ఒకవైపు తలంతా నొప్పి పెడుతుంది, వికారంగా ఉంటుంది. వాంతి వచ్చినట్టుగా అనిపిస్తుంది. కొన్ని రకాల ట్రిగ్గర్ల ద్వారా మైగ్రేన్ నొప్పి మొదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పనులు చేయకుండా ఉంటే మంచిది. లేకుంటే ఈ నొప్పి మొదలైపోతుంది.


నిద్ర తగ్గినా కూడా మైగ్రేన్ నొప్పి మొదలైపోవచ్చు. నిద్ర తగ్గడం అనేది మైగ్రేన్ నొప్పి పెరగడానికి ఒక ప్రేరకమని చెప్పుకోవాలి. కాబట్టి రోజూ ఎనిమిది గంటలకు తగ్గకుండా నిద్రపోయేలా చూసుకోండి.


కాఫీ అలవాటు ఉంటే తగ్గించుకోండి. కాఫీలోని కెఫీన్ కూడా మైగ్రేన్‌కు ట్రిగ్గర్‌లాగే  పని చేస్తుంది. ఈ కెఫీన్ వల్ల మైగ్రేన్ నొప్పి మొదలైపోతుంది. తలనొప్పి మందుల్లో కూడా కెఫీన్ ఉంటుంది. కాబట్టి కాఫీలను ఎంత తగ్గిస్తే అంత మంచిది.
భోజనం తినడం మాత్రం మానేయకండి. భోజనం తినడం మానేసినా కూడా మైగ్రేన్ నొప్పి మొదలవ్వచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పడిపోతే ఆ ప్రభావం మొదట మెదడు మీదే పడుతుంది. దీనివల్ల తలనొప్పి మొదలవుతుంది. కాబట్టి సమయానికి భోజనం చేసేయాలి.


రోజులో కాసేపు వ్యాయామం చేయడం చాలా అవసరం. క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి వ్యాయామం చేస్తే ఈ తలనొప్పిని తగ్గించుకోవచ్చు. మొదట వ్యాయామాలను సింపుల్‌గా మొదలు పెట్టాలి. తర్వాత వేగం పెంచాలి.


మైగ్రేన్ రావడానికి పెద్ద శబ్దాలు, ఎర్రటి ఎండ, మిరుమిట్లు గొలిపే లైట్లు, ఘాటైన వాసనలు కూడా కారణాలే. కాబట్టి మైగ్రేన్ తో బాధపడుతున్న వారు ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. ఏది, ఎప్పుడు తలనొప్పిని ప్రేరేపిస్తాయో చెప్పడం కష్టం.


మహిళల్లో నెలసరి సమయంలో మైగ్రేన్ రావడం సాధారణం. ఎందుకంటే హార్మోన్లు మెదడు మీద ప్రభావం చూపిస్తాయి. హార్మోన్లలో మార్పులు జరిగినప్పుడు కచ్చితంగా మైగ్రేన్ నొప్పి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెలసరి సమయంలో మైగ్రేన్ కి సంబంధించిన మందులు దగ్గర ఉంచుకోవడం ఉత్తమం. 


మైగ్రేన్ నొప్పి నుంచి తప్పించుకోవాలంటే కొన్ని రకాల ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి. కెఫీన్ అధికంగా ఉండే ఆహారాలను తినకూడదు. కాఫీ, చాక్లెట్లలో కెఫీన్ అధికంగా ఉంటుంది. చాక్లెట్లలో బీటా ఫెనిలేథైలమైన్ అనే సమ్మేళనం కూడా ఉంటుంది. ఇది మైగ్రేన్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. చీజ్ ను తినడం తగ్గించాలి. పులిసిన పెరుగు, పులిసిన ఆహారాలను దూరంగా పెట్టాలి. నిల్వ పచ్చళ్లు తినడం తగ్గించాలి. ప్రాసెస్ట్ మాంసాన్ని కూడా తినకూడదు. 


Also read: ఆఫీసుల్లో టీ బ్రేక్, లంచ్ బ్రేక్ లాగే ‘Y బ్రేక్’ కూడా త్వరలో వచ్చేస్తుంది, ఇంతకీ వైబ్రేక్ అంటే?



Also read: ఆగకుండా డాన్స్ చేయడమే ఈ వ్యాధి లక్షణం, వందల మంది దీని బారిన పడ్డారు

























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.