ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆగస్టు 4న కీలక ఆదేశాలు జారీచేసింది. 2017, 2018లో చేపట్టిన ప్రొఫెసర్ల నియామకాలు సక్రమమేనని, వారి నియామకాల రద్దు చెల్లదని, వారిని కొనసాగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసింది. 


ఈ నియామకాలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రొఫెసర్‌ ఎం.వెంకటేశ్వరరావు తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం(ఆగస్టు 4) పిటిషన్‌ విచారణ చేపట్టింది. ప్రొఫెసర్ల తరఫున న్యాయవాది వై.రాజగోపాలరావు వాదనలు వినిపించారు.


రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ అంశంపై విశ్వ విద్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు వచ్చాయని, నియామకాల్లో అన్ని రకాల రిజర్వేషన్ల నిబంధనలు పాటించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని రిజర్వేషన్లు పాటించిన తర్వాత 21 మంది ప్రొఫెసర్లను ఎలా తొలగిస్తారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌ ప్రశ్నించారు.


ప్రొఫెసర్లను కొనసాగించడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిచ్చారు. దాంతో ప్రొఫెసర్లను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. అసిస్టెంట్, అసోసియేట్‌ ప్రొఫెసర్ల తొలగింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను సెప్టెంబరు నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఇందుకు సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.


ALSO READ:


వర్శిటీల్లో పోస్టుల భర్తీకి ఆగస్టు 23న నోటిఫికేషన్ - 3925 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్‌లోని వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో భారీ రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. 3,295 పోస్టుల భర్తీకి సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్సిటీల్లో రెగ్యులర్‌ సిబ్బంది నియామకానికి ఆమోదం తెలిపింది జగన్‌ ప్రభుత్వం. నవంబర్‌ 15 నాటికి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి కానుంది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు.యూనివర్సిటీల్లో 2,635 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు,  ట్రిపుల్‌ ఐటీల్లో 660 పోస్టులు భర్తీ  చేస్తారు.  ఉన్నత విద్యాశాఖలో అత్యున్నత ప్రమాణాల కల్పనలో భాగంగా.. ఇప్పటికే ప్రపంచస్థాయి కరిక్యులమ్‌ ఏర్పాటు దిశగా సన్నాహాలు సాగుతున్నాయి.    


రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం సూచించారు.  ఇప్పటికే కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న వారికి ఏడాదికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు ఇంటర్వ్యూలో వెయిటేజ్ ఇవ్వాలని నిర్ణయించారు. యూనివర్సిటీల్లో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలంటే పూర్తిస్థాయిలో ఖాళీలన్నీ భర్తీ చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  ద్వారా మొత్తం ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.


ఆగస్టు 23న నోటిఫికేషన్  విడుదల..                                                      
విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి ఆగష్టు 23 న నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఒకేసారి 3295 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. సెప్టెంబరు 3, 4 వారాల్లో ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. అక్టోబరు 10 వ తేదీకల్లా పరీక్షా ఫలితాలు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆన్ లైన్‌లో పరీక్షల ఫలితాలు విడుదల తర్వాత నెల రోజుల్లో ఇంటర్వ్యూలు జరుపనున్నారు. మొత్తం ప్రక్రియను నవంబరు 15 నాటికి పూర్తి చేసి అదే రోజు ఎంపికైన అభ్యర్ధుల జాబితాను యూనివర్సిటీల వారీగా ప్రకటించనున్నారు.


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...