అర్ధరాత్రి లేచి అరవడం, కళ్ళు పెద్దవి చేసి భయపెట్టడం, ఏదేదో మాట్లాడడం, విచిత్రంగా ప్రవర్తించడం... ఇవన్నీ చూసినవారు కొంతమంది మానసిక రోగంగా భావిస్తే, మరి కొంత మంది మాత్రం దెయ్యం పట్టిందని భావిస్తారు. ముఖ్యంగా పల్లెటూర్లలో ఉన్నవారు ఈ విచిత్ర ప్రవర్తనను దెయ్యం పట్టినట్టుగానే చెబుతారు. మంత్రగాళ్లను తీసుకొచ్చి విచిత్ర పూజలు చేయిస్తారు. నిజానికి ఇలాంటి ప్రవర్తనకు కారణం ఒక మానసిక రోగం. అది ఒక నిద్రా రుగ్మత. దాన్ని పారాసోమ్నియా అని పిలుస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరికైనా ఇది రావచ్చు.
ఈ పారాసోమ్నియా బారిన పడినవారు గాఢ నిద్రలోకి వెళ్ళాక విచిత్రంగా ప్రవర్తిస్తారు. హింసాత్మక పనులు చేస్తారు, కానీ వారు నిద్రలోనే ఉంటారు. గట్టిగా అరవడం, ఏడవడం, కళ్ళు పెద్దవి చేసి చూడడం వంటివి చేస్తారు. ఏదేదో మాట్లాడుతారు. ఎక్కువసేపు అలా చేయరు, కొన్ని నిమిషాల పాటు అలా ప్రవర్తించి మళ్లీ నిద్రలోకి వెళ్లిపోతారు. పారాసోమ్నియా బారిన పడిన వారి లక్షణాలు ఇలానే ఉంటాయి.
చాలా తక్కువ మందిలోనే ఈ పారాసోమ్నియా లక్షణాలు కనబడతాయి. ఐదేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు తరచుగా ఈ వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఏడాదిన్నర నుంచి ఐదేళ్ల లోపు పిల్లల్లో ఈ నిద్రా రుగ్మత కనిపిస్తుంది. పెద్దవారిలో ఈ సమస్య తక్కువగా ఉంటుంది.
ఈ పారాసోమ్నియా ఎందుకు వస్తుందో స్పష్టంగా చెప్పడం కష్టం. గాఢనిద్రలోకి వెళ్ళాకే ఈ దశ మొదలవుతుంది. ఎక్కువగా అలసిపోవడం, నిద్ర సరిగా పట్టకపోవడం, విపరీతంగా జ్వరం రావడం వంటివి కూడా ఈ పారాసోమ్నియా రావడానికి కారణం కావచ్చు. అలాగే వారసత్వంగా కూడా కొందరికి ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చిన పిల్లలు చాలా భయంకరంగా అరుస్తూ ఉంటారు. ఒక్కోసారి దేనినో చూసి భయపడుతున్నట్టు ప్రవర్తిస్తారు. హఠాత్తుగా లేచి మంచం మీద నిల్చోవడం, కూర్చోవడం చేస్తారు. ఆ సమయంలో వారు చాలా భయపడుతున్నట్టు కనబడతారు. శ్వాస వేగంగా తీసుకుంటారు, చెమటలు పట్టేస్తాయి. చాలా ఆందోళన పడుతున్నట్టు ఉంటారు. కాసేపటికి సాధారణంగా మారి మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్తారు.
ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్న పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ చాలా అవసరం. వారిని ఎక్కువగా తమకు దగ్గరగానే పడుకోబెట్టుకోవాలి. వారిని పట్టుకుని ఉండేందుకు ప్రయత్నించాలి. వారిని దగ్గరకు తీసుకోవాలి. వారితో తల్లిదండ్రులు ఉన్నారన్న భరోసా ఇవ్వాలి. వారు అరుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు ఆ మైకం నుంచి బయటికి వచ్చేలా పదే పదే వారిని పిలిచి లేపాలి. వైద్యులను కలిస్తే వారు మందులను సూచిస్తారు. ఆ మందులు కన్నా కూడా ఇంట్లోనే వ్యక్తుల ప్రేమే వారిపై ప్రభావం వింతగా పనిచేస్తుంది.
Also read: బరువు పెరుగుతున్నారని అన్నం తినడం మానేయకండి, అది చాలా ప్రమాదకరం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.