BJP : ఏపీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంతో జరుగుతున్న ప్రచారం, కేసులు,  తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం పేరుతో జరుగుతున్న రచ్చ.. జరగబోయే పరిణామాలు ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి.  రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో  కనిపించని అదృశ్య శక్తి  ఏదో జోక్యం చేసుకుంటున్నట్లుగా చాలా మందికి అనిపిస్తోంది. ఆ అదృశ్య శక్తి బీజేపీనేనని ఎక్కువ మంది నమ్మకం. దీనికి కారణం బీజేపీ  జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తూ ఉండటం.. మరికొన్నింటికలో కదలికలు వచ్చేలా చేయడం కారణం.  


ఢిల్లీ లిక్కర్ స్కామ్ హఠాత్తుగా ఎందుకు కదిలింది ?   
 
ఇది ఎన్నికల సీజన్.  పరిణామాలు ఎలాంటివైనా ప్రజలపై ప్రభావం చూపిస్తాయి. తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాంలో రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారి.. ఈడీకి వాంగ్మూలం ఇచ్చారని ఒక్క సారిగా లీక్ వచ్చింది.  ఈయన కవిత తరపున బినామీగా వ్యవహరంచారని ఈడీ చెబుతోంది. వెంటనే కవితకు నోటీసు వచ్చింది. కానీ పిళ్లై మాత్రం తాను అప్రూవర్ గా మారలేదంటున్నారు.  ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్లు అయ్యారు.కవిత ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబు కూడా అప్రూవర్ అయ్యారని చెబుతున్నారు. ఆయన దగ్గర నుంచి ఇటీవల స్టేట్ మెంట్లు కూడా మళ్లీ తీసుకున్నారు.   గతంలో కవితను ఈడీ అరెస్టు చేసే వరకూ వచ్చింది. కానీ చివరి క్షణంలో ఆగిపోయింది.  తర్వాత రెండు పార్టీల మధ్య ఏదో ఒప్పందం జరిగిందని అందుకే అందరూ సైలెంట్ గా ఉన్నారన్న చర్చ జరుగుతోంది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ కేసులో కదలికలు కనిపిస్తున్నాయంటే.. మళ్లీ  బీజేపీ ఏమైనా ప్లాన్ చేసుకుందా ... అనే డౌట్ వస్తోంది. బీజేపీ వ్యూహాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. పది రోజుల పాటు సుప్రీంకోర్టులో కవితకు ఊరట లభించినా.. తర్వాత ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. 


ఏపీలో పరిణామాల వెనుక బీజేపీ ఉందా ? 
 
మరో వైపు ఏపీలో జరుగుతున్న  రాజకీయ పరిణామాల వెనుక బీజేపీ ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి . ఇంత దారుణంగా చట్ట  ఉల్లంఘన చేస్తూ...  ఓ మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తూంటే కేంద్రం ఎందుకు పట్టించుకోలేదన్నది ఇక్కడ ప్రశ్న. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా....  పదహారేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుకు కనీస హక్కులు కూడా లేకుండా అరెస్ట్ చేయడం ...  వేధింపులకు పాల్పడటం ..   అదీ కూడా ఏ మాత్రం ఆధారాలు లేవని దర్యాప్తు చేస్తున్నామని సీఐడీ అధికారి సంజయ్ చెబుతూండటంతో కేసులో ఏదో జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.   వైసీపీ కూడా తాము బీజేపీ అనుమతితోనే చేస్తున్నట్లుగా అంతర్గతంగా ఓ ప్రచారం చేసుకుంటోంది.  వైసీపీ ధైర్యం.. తమ మద్దతు పార్లమెంట్ సమావేశాల్లో  బీజేపీకి అవసరం ఉండటమేనని అంటున్నారు.   ఈ అంశంపై బీజేపీ ఇప్పటికే ముందుగానే స్పందించింది.    అక్రమ అరెస్టును ఏపీ  బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి   ఖండించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వంటి వారు కూడా అరెస్ట్ చేసిన విధఆనం కరెక్ట్ కాదన్నారు. 


వైసీపీ అవసరం ఉండటం వల్లనే సహకరిస్తున్నారా ? 
   
ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెట్టాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోంది. జమిలి ఎన్నికల బిల్లు, యూసీసీ, మహిళా బిల్లులను ఆమోదం పొందేలా కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బిల్లుల ఆమోదం కోసం కేంద్రం NDA పక్షాలతో పాటుగా తటస్థంగా ఉన్న పార్టీల మద్దతు కోరుకుంటోంది. పార్లమెంట్‌లో వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లు ఆమోదం పొందాలంటే లోక్‌సభలోని 543 స్థానాల్లో 67 శాతం మద్దతు దక్కాలి. దీంతో పాటుగా రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం దీనిని సమర్ధించాలి. దీంతో పాటుగా దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు దీనికి ఆమోదముద్ర వేయాలి. లోక్‌సభలో బీజేపీకి 333 సీట్ల ఉన్నందున  61 శాతం మద్దతు ఉన్నట్టే. కానీ.. బిల్లు ఆమోదానికి మరో 5 శాతం ఓటింగ్ అవసరం. లోక్‌సభలో వైసీపీకి 22 మంది సభ్యులు ఉన్నారు. రాజ్యసభలో చూసుకున్నా... 38 శాతం ఎన్డీఏ కూటమికి మద్దతు ఉంది. అక్కడా వైసీపీ మద్దతు అవసరం. రాజ్యసభలో వైసీపీకి ఉన్న తొమ్మిది మంది సభ్యులు బిల్లుల ఆమోదానికి కీలకంగా మారారు. అందుకే బీజేపీ ప్రకటనలకే పరిమితమిందని చెబుతున్నారు. 
  
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో బీజేపీ  ప్రమేయం ఉంది. కానీ అది  తెర వెనుకే ఉందన్న నమ్మకం ప్రజల్లో  బలపడుతోంది. ఇందులో నిజానిజాలెంతో తదుపరి జరగబోయే పరిణామాలను  బట్టి అర్థం చేసుకోవచ్చు.