అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలా మంది అన్నాన్ని తినడం మానేసి చపాతీలు తినడం ద్వారా బరువు తగ్గాలని చూస్తున్నారు. నిజానికి బరువు ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్నా ప్రతిరోజు అన్నం తినడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి వ్యాయామాలు వంటివి చేయడం మంచిది. అంతేకానీ అన్నాన్ని  తినడం మానేస్తే శరీరానికి ఎంతో హాని కలుగుతుంది.  అన్నం తగ్గిస్తే శరీరంలో హార్మోన్లు అసమతుల్యత రావచ్చు. ఇది శరీరంలో ఎన్నో మార్పులకు గురవుతుంది. అంతేకాదు వృద్ధాప్యం చిన్న వయసులోనే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నాన్ని మానడం మంచి పద్ధతి కాదు.


అన్నం తినడం మన చర్మానికి చాలా అవసరం. ఎందుకంటే వైట్ రైస్‌లో అధిక ప్రోలాక్టింగ్ ఉంటుంది. ఇది చర్మ రంధ్రాలను కాపాడుతుంది. జుట్టు పెరుగుదలను రక్షిస్తుంది. థైరాయిడ్ బలహీనంగా మారకుండా అడ్డుకుంటుంది. కాబట్టి అన్నాన్ని తినడం మానేయడం అనేది హానికరమైన నిర్ణయంగానే చెప్పాలి. అన్నంతో పాటు పెరుగు, చిక్కుళ్ళు, మాంసం, పప్పులు వంటి కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. కేవలం అన్నం ఒకటే తినడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కూరలను కూడా కలిపి తింటేనే ఆరోగ్యం అన్నం తినడం వల్ల నిద్రా వ్యవస్థ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అన్నం తింటే నిద్ర బాగా పడుతుంది. ముసలివారికి, యువకులకు అవసరమైన హార్మోన్ల సమతుల్యత అన్నం వల్ల లభిస్తుంది.


బియ్యంలో కొవ్వు, కొలెస్ట్రాల్, సోడియం వంటివి తక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తినడం వల్ల ఎలాంటి హాని జరగదు. దీనిలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి శక్తి వెంటనే అందుతుంది. ఈ కార్బోహైడ్రేట్లలో మెదడు పనితీరు కూడా అవసరం. అలాగే బియ్యంలో విటమిన్‌లు, ఖనిజాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా జీవక్రియ కార్యా కలాపాలకు అవసరమైనవి. అందుకే బరువు పెరుగుతామన్న కారణంగా అన్నాన్ని పూర్తిగా మానేయకూడదు. కాకపోతే తగ్గించవచ్చు. అన్నం తక్కువగా తిని బరువు తగ్గేందుకు కూరగాయలను అధికంగా తింటే అధిక బరువు అదుపులో ఉంటుంది. ఒకవేళ వైట్ రైస్ తినలేకపోతే బ్రౌన్ రైస్ తినేందుకు ప్రయత్నించండి. అంతేకానీ అన్నం తినడం పూర్తిగా మానేయకండి.
 
అధిక రక్తపోటు ఉన్నవారు అన్నాన్ని ఎంత తిన్నా మంచిదే. ఎందుకంటే దీనిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అన్నంలో కూరల్ని అధికంగా వేసుకొని తింటే శరీరానికి కూడా ఎంతో మంచిది. అన్నంలో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది అనేక రకాల క్యాన్సర్ల నుంచి మనల్ని రక్షిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.


నూనెలో కూడా ధాన్యపు పొట్టుతో చేసే రైస్ బ్రాన్ ఆయిల్ మంచిదని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ధాన్యపు పొట్టు మేలు చేస్తున్నప్పుడు లోపలి గింజ అయిన బియ్యం మేలు చేయకుండా ఉండదని, కాబట్టి అన్నాన్ని తినడం మానేయడం అనేది మంచి నిర్ణయం కాదని చెబుతున్నారు. ఆయుర్వేద నిపుణులు కూడా బియ్యంతో చేసిన వంటకాలు తినడం చాలా ముఖ్యమని, దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయని వివరిస్తున్నారు. నియాసిన్, విటమిన్ డి, కాల్షియం, ఐరన్, థయామిన్, ఫైబర్ ఇవన్నీ కూడా బియ్యంలో ఉంటాయి. ఇవన్నీ కూడా మన రోగనిరోధక వ్యవస్థకు, అవయవ వ్యవస్థకు అవసరమైనవి. బియ్యంలో ఉండే రెసిస్టెంట్ స్టార్చ్ పేగులకు చేరుతుంది. అక్కడ పేగు కదలికలకు సహాయపడుతుంది. అలాగే పొట్టలోని మంచి బాక్టీరియాను కాపాడుతుంది. కాబట్టి రోజులో ఒక పూటైనా బియ్యంతో చేసిన వంటకాలను తినేందుకు ప్రయత్నించండి. 


Also read: అయోడిన్ సరిపడా తింటున్నారా? అది లోపిస్తే ఈ జబ్బు రావడం ఖాయం































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.