Kids SmartPhone: ఫోన్ ఉంటే చాలు పిల్లలు ఈ లోకాన్ని మరిచిపోతారు. పోనీలే అల్లరి పెట్టుకుండా ఆడుకుంటారని చాలా మంది తల్లిదండ్రులు కూడా ఫోన్ ఇచ్చేస్తున్నారు. అందులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే పేరెంట్స్, పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి తమ పని తాము చేసుకుంటున్నారు.కానీ వారికి తెలియని విషయం ఏంటంటే పిల్లల చేతికి ఫోన్ ఇచ్చి వారిని ఆ ఫోన్ బానిసలుగా చేస్తున్నారు. డిజిటల్ ప్రపంచంలో పుట్టిన పిల్లలు గాడ్జెట్లకు బాగా అలవాటు పడటానికి తొలి అడుగు పడేది ఫోన్ చూడడం దగ్గర నుంచే. పిల్లలు ఎంతగా ఫోన్ కు అలవాటు పడుతున్నారంటే నేషనల్ కమీషన్ ఫర్ ప్రొటెక్షన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, దాదాపు 23.80% మంది పిల్లలు నిద్రపోయే ముందు కూడా స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. 37.15% మంది పిల్లల్లో తరచూ ఫోన్ చూడడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గిపోయింది. 2019లో ప్రచురించిన మరొక అధ్యయనం 2011 నుంచి 2017 జరిగిన 41 పరిశోధనలను అంచనా వేసింది. వాటిలో 23% మంది పిల్లలు స్మార్ట్ ఫోన్ వినియోగం వల్ల మానసిక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నట్టు తేలింది. వారిని ఫోన్ బానిసలుగా చేసుకుంటోందని చెప్పింది.
చాలా ప్రమాదం
స్మార్ట్ ఫోన్‌కు పిల్లలు అలవాటు పడడం చాలా ప్రమాదం. ఇది పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. వారిలో ప్రవర్తనా సమస్యలు, డిప్రెషన్, ఊబకాయం, నాడీ సమస్యలు వంటివి కలిగే ప్రమాదం ఉంది.
ఈ లక్షణాలు ఉంటే...
తల్లిదండ్రులు తమ పిల్లలు ఫోన్ బానిసలుగా మారారో లేదో కొన్ని లక్షణాల ద్వారా కనిపెట్టవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే వారిలో సమస్యలు మొదలైనట్టే లెక్క. అంటే వెంటనే ఫోన్ ను దూరం ఉంచాలని అర్థం.
1. వారికి నిద్ర సరిగా పట్టదు.
2. ఫోన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు.
3. కోపాన్ని, దూకుడును ప్రదర్శిస్తారు.
4. ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతారు. తాను, తన ఫోన్ అంతే వారి ప్రపంచంగా మారుతుంది.
5. ఫోన్ ఇవ్వకపోయినా, ఆ ఫోన్ కనిపించకపోయినా చాలా బాధ పడిపోతారు. ఆందోళన చెందుతారు.
పిల్లలకు హెల్ప్ చేయండి
పిల్లలు ఫోన్ కు అలవాటు పడకుండా చేయాలన్నా, ఆ వ్యసనాన్ని వదిలించాలన్న తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఇది పెద్ద సవాలే కానీ పిల్లల ఆరోగ్యం, భవిష్యత్తు కోసం చేయకతప్పదు.
1. ఫోన్ చూడటానికి నిర్ధిష్టమైన సమయాన్ని పెట్టండి. అది కూడా కేవలం అరగంట మాత్రమే.
2. కుటుంబంతో పిల్లాడు కలిసే సమయాన్ని పెంచండి. ఆ సమయంలో అతడికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి.
3. నిద్రకు రెండు గంటల ముందు నుంచే ఫోన్ చూడడాన్ని నిషేధించండి.
4. ఫోన్లు, ట్యాబ్లెట్ వంటివి గిఫ్టులుగా ఇవ్వకండి.
5. ఫోన్ కాకుండా వారికి ఇంకేమైనా ఆసక్తులు ఉన్నాయేమో చూసి వాటిని ప్రోత్సహించండి.
Also read: ప్రపంచంలోనే తొలిసారిగా పేగు మార్పిడి చేసిన వైద్యులు, అది కూడా 13 నెలల వయసు పాపకి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.