వైద్య చరిత్రలో ఇదొక అద్భుతం. ఇంతవరకు కళ్లు, గుండె, కాలేయం వంటివి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు వైద్యులు. కానీ తొలిసారి పేగులు చేశారు. అది కూడా ఏడాది వయసున్న చిన్నారిలో. ఇది నిజంగా మెడికల్ మిరాకిల్ అనే చెప్పుకోవాలి. స్పానిష్ వైద్యులు ఈ అద్భుతమైన అవయవ మార్పిడిని చేశారు. ఈ పాప పేగులను పొందిన తొలి అవయవ గ్రహీతగా రికార్డులకెక్కింది. ఈ చిన్నారి పేరు ఎమ్మా. ఈమెకు గుండె వైఫల్యంతో మరణించిన ఒక దాత నుంచి పేగులను తీసి ఆమె పొట్టలో అమర్చారు. ప్రస్తుతం పాప బాగా కోలుకుంటోంది. ఆమెకు 13 నెలల వయసులో ఈ అవయవ మార్పిడి చికిత్స జరిగింది. ఇప్పుడు ఆమెకు 17 నెలల వయసు. ఇంతకాలం ఆమెను అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఇక బతుకుతుందన్న నమ్మకం రావడంతో ఈ అవయవ మార్పిడి గురించి ప్రపంచానికి తెలియజేశారు.
అసలేమైంది?
ఎమ్మా పాప పేగు సమస్యలతో జన్మించింది. చాలా చిన్న పేగులు ఉండడంతో చాలా ఇబ్బందులు పడింది.ఆ పేగులు సరిగా పనిచేయక విఫలం అయ్యాయి. దాంతో ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. దీంతో వైద్యులు ఆమెను ఏడాది వయసు వచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ వయసు వచ్చాక అవయవమార్పిడి చేశారు. కొత్త పేగులతో పాటూ ఆమెక కాలేయం, ప్లీహం, ప్యాంక్రియాస్ కూడా కొత్తవి పెట్టారు. ఈ చిన్నారి బతుకుతుందని వైద్యులు కూడా అనుకోలేదు. కానీ సర్జరీ అయి తేరుకున్నాక సాధారణ జీవితం గడపసాగింది.
పేగు మార్పిడి ఎప్పుడు అవసరం?
చిన్న పేగు లేదా పెద్ద పేగు మార్పిడి ఎప్పుడు అవసరం పడుతుందంటే అవి తమ పనిని సక్రమంగా పనిచేయనప్పుడు, లేక ఇన్ఫెక్షన్‌తో పాడైనప్పుడు. పెద్ద వాళ్ల చిన్న పేగులోని కొంత భాగాన్ని తీసి పిల్లలకు అమర్చవచ్చు. అదే సమయంలో ఇతర అవయవాల మార్పిడి కూడా చేయవచ్చు. ఎమ్మాకు అలాగే చేశారు. పిల్లలు పేగు వ్యాధితో బాధపడుతున్నప్పుడు వారికి సిరల ద్వారా పోషకాహారాన్ని అందిస్తారు వైద్యులు. దీన్నే టోటల్ పేరెంటరల్ న్యూట్రిషన్ (TPN) అంటారు. కానీ TPN చాలా కాలం పాటు చేయవలసి వస్తే తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది.అందుకే దీన్ని ఎక్కువ కాలం పాటూ కొనసాగించలేం. ఎమ్మా విషయంలో కూడా ఇలాగే జరిగింది. అందుకే వైద్యులు పేగు మార్పిడిని ఎంచుకున్నారు. చిన్నారికి కొత్త జీవితాన్ని ఇచ్చారు.
ఎమ్మా తల్లిదండ్రులు వైద్యులకు, పేగును ఇచ్చిన దాత కుటుంబానికి ధన్యవాదాలు చెబుతూనే ఉన్నారు. అవయవదానంతో ఓ నిండు ప్రాణం నిలబడింది. చనిపోయాక మనిషి తన శరీరంలో ఉండే 200 అవయవాలు, కణజాలాలను దానం చేయవచ్చు. వాటితో కొన్ని నిండుప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి ఆరు నుంచి ఏడుగురికి ప్రాణం పోయగలడు. అందుకే అవయవ దానంపై అవగాహన పెంచుకోవడం అవసరం.
Also read: ఎక్కువ సమయంపాటూ కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ చూస్తే సైట్ వస్తుందా?
Also read: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు