కార్టిసాల్... ఇదొక ఒత్తిడి హార్మోన్. మనకు కంగారు కలిగించే లేదా భయం కలిగించే సంఘటన జరిగినప్పుడు శరీరంలో సహజంగా ఏర్పడే ప్రతిస్పందనలో భాగంగా ఇది ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక సహజ అంతర్నిర్మిత అలారం వ్యవస్థ లాంటిది. ఈ హార్మోన్ స్థాయిలు ఒకేలా ఉండవు. పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. అయితే అధికంగా ఈ  హార్మోన్ ఉత్పత్తి అవ్వడం అనేది మాత్రం చాలా ప్రమాదకరం.  కార్టిసాల్ అధికంగా ఉత్పత్తి అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కండరాలు బలహీనంగా మారుతాయి. ముఖం ఉబ్బినట్టు అవుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోయినట్టు అనిపిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అధిక రక్తపోటు వస్తుంది. ఎముకలు బలహీనంగా మారుతాయి. మూడు స్వింగ్స్ వస్తాయి. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత లోపిస్తాయి. 


కాబట్టి కార్టిసాల్ హార్మోను అధికంగా ఉన్నట్టు అనిపిస్తే, ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువ నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడితో కూడిన ఆలోచనలకు దూరంగా ఉండాలి. శ్వాస వ్యాయామాలను ప్రాక్టీస్ చేయాలి. మీకు నచ్చిన పనులు చేస్తూ ఉండాలి. వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలి. శరీరంలో కార్టిసాల్ పూర్తిగా ఉత్పత్తి కాకపోయినా, అతి తక్కువగా ఉత్పత్తి అవుతున్నా కూడా ప్రమాదమే. అది రోజుకు ఎంత ఉత్పత్తి అవ్వాలో, ఆ స్థాయిలో అయితే మన ఆరోగ్యం బాగుంటుంది.


కార్టిసాల్ మన శరీరానికి చాలా రకాలుగా అవసరం. శరీరం కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను ఉపయోగించుకోవడానికి కార్టిసాల్ సహకరిస్తుంది. శరీరంలోని ఇన్ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. రక్త పోటును నియంత్రణలో ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శక్తిని పెంచి శరీరంలో సమతుల్యత ఉండేలా చూస్తుంది.  కాబట్టి కార్టిసాల్ పూర్తిగా విడుదలవ్వకపోయినా ప్రమాదమే. ఇది మితంగా ఉత్పత్తి అవ్వాల్సిందే.


ఒత్తిడి హార్మోను తగ్గించే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. ఒత్తిడి తగ్గాలంటే సెరోటోనిన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేసే ఆహారాలను కచ్చితంగా తినాలి. ముఖ్యంగా రోజూ అరటి పండ్లు, బాదం పప్పులు, పాలు, కోడి గుడ్లు, పప్పు ధాన్యాలు వంటివి అధికంగా తినాలి. ఆనంద హార్మోన్ అయిన ఎండార్ఫిన్ స్థాయిలను పెంచే ఆహారాలను కూడా తినాలి. ఇందుకోసం డార్క్ చాకొలెట్ రోజూ చిన్న ముక్క తినాలి. క్యాప్సికమ్ వంటలు అధికంగా తినాలి. పిల్లలతో సంతోషంగా గడపాలి. ఆయుర్వేదం ప్రకారం అశ్వగంధను వాడడం వల్ల కూడా ఒత్తిడి హార్మోను తగ్గుతుంది. 



Also read: నెలరోజుల పాటు నిల్వ ఉండేలా కరివేపాకు పచ్చడి రెసిపీ ఇదిగో


Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది









































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.