యాభై రూపాయల కరివేపాకు తెచ్చుకుంటే చాలు, నెల రోజులకు సరిపడా పచ్చడి చేసి పెట్టుకోవచ్చు. వేడివేడి అన్నంలో ఈ కరివేపాకు పచ్చడి కలుపుకొని తింటే రుచి అదిరిపోతుంది. అంతేకాదు ఈ పచ్చడి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందుతాయి. కూర వండుకోవడానికి బద్దకించినప్పుడు ఈ పచ్చడితో భోజనాన్ని ముగించవచ్చు. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులువు. స్సైసీగా కావాలనుకుంటే ఎక్కువ ఎండుమిర్చిని కలిపి చేసుకోవచ్చు. ఎలా చేసినా కరివేపాకులు తినడం వల్ల ఆరోగ్యమే కానీ ఎలాంటి అనారోగ్యాలు రావు. 


కావాల్సిన పదార్థాలు 
కరివేపాకులు - నాలుగు కప్పులు
మెంతులు - ఒక స్పూను 
నూనె - తగినంత 
శెనగపప్పు - ఒక స్పూను 
ధనియాలు - రెండు స్పూన్లు 
మినప్పప్పు - ఒక స్పూను 
ఆవాలు - ఒక స్పూను 
జీలకర్ర - ఒక స్పూను 
చింతపండు - నిమ్మకాయ సైజులో 
ఎండుమిర్చి - 15 
కల్లుప్పు- రెండు స్పూన్లు 
వెల్లుల్లి రెబ్బలు - 10 
ఉప్పు - రుచికి సరిపడా


తయారీ ఇలా
1. కరివేపాకులను శుభ్రంగా కడిగి ఒక వస్త్రంపై ఆరబెట్టాలి. వీటిని ఎండలో ఆరబెట్టకూడదు. గాలికి తడి ఆరిపోయేలా చేయాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనెలో మెంతులు వేసి వేయించాలి. తరువాత శెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 
3. ఇప్పుడు అదే కళాయిలో మరి కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి వేయించాలి. తర్వాత కరివేపాకు చింతపండు వేసి కూడా వేయించాలి. అందులోనే ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించాలి. 
4. ఒక నిమిషం పాటు వేయించాక స్టవ్ కట్టేయాలి. వాటన్నింటినీ చల్లార్చాలి. మిక్సీ జార్లో ఈ కరివేపాకుల మిశ్రమాన్ని వేసి మెత్తగా మిక్సీ పట్టాలి.
5. వాటిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీలకర్ర, ఆవాలు మిశ్రమాన్ని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే నూనె వేయాలి తప్ప నీళ్లు వేయకూడదు.
6. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో జీలకర్ర ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. 
7. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలో ఈ మిశ్రమం పచ్చడిని వేసి మూత పెట్టేయాలి. 
8. గాలి చొరబడకుండా చూసుకుంటే ఇది నాలుగు నెలల పాటు తాజాగా ఉంటుంది. వేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.



Also read: ఆ వీరుడి కొడుకు పేరునే సాంబార్‌కు పెట్టారు, ఈ వంటకం వెనుక ఆసక్తికరమైన కథ ఇది



Also read: అర నిమిషంలో ఆ బిడ్డ తండ్రి ఎవరో కనిపెట్టండి, అలా చేస్తే మీ మెదడు పనితీరు సూపర్







































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.