BJP YCP Relation : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన లోటు భర్తీ నిధులను కేంద్రం విడుదల చేసింది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా నిధులను విడుదల చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి ఎంతగానో ఉపయోగపడుంది. సమస్యల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడతాయి. ఈ ఏడాది మీట నొక్కాల్సిన పథకాలు.. రైతు భరోసా, అమ్మఒడి వంటి వాటికి ఆ నిధులు సరిపోతాయి. అంతేనా.. ప్రతీ వారం రూ. రెండు వేల కోట్లు అప్పులకు కేంద్రం పర్మిషన్ ఇస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం.. బటన్ నొక్కే కష్టాలు తీరిపోయినట్లేనని..వైసీపీకి బీజేపీకి ఇంత కంటే గొప్ప సాయం ఎలా చేయగలదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టీడీపీ హయాంలో ఇవ్వాల్సిన నిధులు ఇప్పుడు విడుదల
రాష్ట్రం ఏర్పడిన సంవత్సరంలో లోటును భర్తీ చేయాలని విభజన చట్టంలో ఉంది. ఆ మేరకు .. లోటు భర్తీ కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసిందో లెక్కేలేదు. చివరికి విసుగొచ్చేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చింది. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు జగన్ రెడ్డి సర్కార్ కు ఆ నిధులన్నీ ఇస్తోంది. దాదాపుగా రూ. పది వేల కోట్లకుపైగా లోటు భర్తీ నిధులు రాష్ట్రానికి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఏపీ ప్రభుత్వం పండగ చేసుకోనుంది. కేంద్ర - రాష్ట్రాల మధ్య రాజ్యాంగపరమైన సంబంధాలు ఉంటాయి. వాటికి రాజకీయాలతో సంబంధం లేదు. చట్ట ప్రకారం రాష్ట్రాలకు కేటాయించాల్సిన నిధులు రాజ్యాంగపరంగా ఉంటాయి. ఆ ప్రకారం కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వాల్సిందే. విభజన చట్టంలో భాగంగా కేంద్రం లోటు భర్తీ చేయాల్సి ఉంది. ఆ మేరకు లోటు భర్తీని కేంద్రం చేసింది. ఏపీకి రూ. పది వేల కోట్లకుపైగా నిధుల్ని ఇచ్చింది. కానీ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడెందుకు ఇస్తున్నారన్నది అసలు రాజకీయవర్గాలకు వచ్చిన డౌట్
వైసీపీకి బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్న టీడీపీ !
ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ విముక్త ఏపీ కోసం బీజేపీని కలుపుకుంటామని ప్రకటించారు. అంతే కాదు బీజేపీ కలిసి వస్తుందని కూడా ప్రకటించేశారు. కానీ టీడీపీ మాత్రం ముందు వైసీపీకి.. బీజేపీకి దూరమని ప్రజలు అనుకోవాలన్నారు. అందు కోసం అడ్డగోలుగా అప్పులు ఇవ్వడం మానుకోవాలని .. సహకరించడం ఆపేయాలన్నారు. కానీ అనూహ్యంగా గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వడంతో ఇప్పుడు వైసీపీకి..బీజేపీ మరింత దగ్గరన్న వాదన వినిపించడానికి ఎక్కువ అవకాశం ఏర్పడింది.
రాజకీయానికి సంబంధం లేదంటున్న ఏపీ బీజేపీ !
అయితే భారతీయ జనతా పార్టీకి రాష్ట్రం ముఖ్యమని..ఎవరు అధికారంలో ఉన్నారన్నది కాదని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. గత తొమ్మిది సంవత్సరాల్లో ఏపీ ప్రయోజనాల కోసం దాదాపు 3 లక్షల కోట్లు బిజెపి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఇచ్చిందని గుర్తు చేశారు. రాజకీయాల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపదని తాజాగా ఇచ్చిన నిధుల ద్వారా స్పష్టమయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అంటున్నారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధుల పట్ల రాజకీయం చేయడం రాష్ట్ర ప్రయోజనాలకు ద్రోహం చేయడమేనని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. నిధులు ఇవ్వడం లేదని ఇంత కాలం నిందలు వేశారని.. ఇప్పుడు ఇచ్చారని అనడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ నేతలు ఎలా సమర్థించుకున్నా.. ప్రస్తుతం అటు ఆర్థికంగా.. ఇటు కేసుల పరంగా జరుగుతున్న పరిణామాలు చూస్తే.. బీజేపీకి వైసీపీకి దగ్గరే అన్న భావన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తాయి. మరి ..బీజేపీని కలుపుకోవాలనుకుంటున్న పవన్ కల్యాణ్ ప్రస్తుత పరిస్థితులపై ఎలా స్పందిస్తారో ?