YS Jagan About 4 years of YSRCP Rule: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో నాలుగేళ్లు పూర్తి అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గానూ 151 సీట్లు సాధించి, భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎం అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ జగన్ నాయకత్వంలో వైసీపీ సత్తా చాటింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకుగానూ 22 సీట్లు కైవసం చేసుకుంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు అన్ని హామీలను సీఎం వైఎస్ జగన్ నెరవేర్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ వైసీపీ తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలో పేర్కొంది. 


తన నాలుగేళ్ల పాలనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు. హామీలను నెరవేర్చామని చెప్పిన సీఎం జగన్, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అన్నారు. ‘దేవుడి ద‌య‌, మీ అంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో నాలుగేళ్ళ క్రితం మ‌న ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చింది. మీరు అప్ప‌గించిన బాధ్యతను మీకు సేవ చేసే అవ‌కాశంగా భావించి, ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను మ‌న ప్ర‌భుత్వంలో ఒక్కొక్క‌టిగా అమ‌లు చేశాం. మ‌రోసారి మీకు సేవ చేసే అవ‌కాశం ల‌భించేందుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కు 175 స్థానాల్లో గెలుపొందేలా అడుగులు వేస్తున్నాం.’ అని ట్వీట్లో పేర్కొన్నారు.






అధికారంలోకి వ‌చ్చిన ఈ నాలుగేళ్ళలో రాష్ట్రంలోని ప్ర‌తి వ‌ర్గానికి, ప్ర‌తి పేద కుటుంబానికి న్యాయం జ‌రిగేలా దేశంలో ఎక్క‌డా లేనివిధంగా సీఎం జగన్ సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఆ ప‌థ‌కాల ద్వారా దాదాపు రూ.3.01 ల‌క్ష‌ల కోట్ల మేర ప్ర‌జ‌ల‌కు ల‌బ్ధి చేకూర్చాం అని వైసీపీ పార్టీ ట్వీట్ చేసింది. దేవుడి దయతో, ప్రజల ఆశీస్సులతో కేవలం 4 ఏళ్ల కాలంలోనే వైసీపీ ఎన్నికల మేనిఫేస్టో లో ఇచ్చిన హామీలలో 98.4% హామీలు సీఎం జగన్ నెరవేర్చారు అని పార్టీ నేతలు చెబుతున్నారు.






 47 నెలల్లో డీబీటీ రూపంలో పేదల ఖాతాల్లో రూ.2.10 లక్షల కోట్లు జమ చేశామన్నారు వైసీపీ నేతలు, ఏపీ మంత్రులు.  నామినేటెడ్ నుంచి కేబినెట్ వరకూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేశామన్నారు. పంచాయతీ, మండల పరిషత్, జెడ్పీ, పురపాలక, ఉపఎన్నికల్లోనూ రికార్డు విజయాలు సాధించామన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో ఈ ప్రభుత్వానికి 1.16 కోట్ల కుటుంబాల మద్దతు లభించిందన్నారు.