CBI summons Sameer Wankhede: ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ముంబై ఎన్‌సీబీ మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ అధికారులు మాజీ యాంటీ డ్రగ్స్ ఆఫీసర్ సమీర్ వాంఖడేను మే 24న విచారణకు హాజరు కావాలని నోటీసులలో పేర్కొంది. ఈ విషయంపై సీబీఐ ఇదివరకే రెండు పర్యాయాలు సమీర్ వాంఖడేను విచారించగా.. తాజాగా మరోసారి విచారణకు హాజరు కావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది.
ముంబైలో క్రూయిజ్ షిప్ లో డ్రగ్స్ లభించిన కేసులో ఆర్యన్ ఖాన్ ను మాజీ యాంటీ డ్రగ్ అధికారి సమీర్ వాంఖడే అరెస్టు చేశారు. అనంతరం విచారణ చేపట్టిన సమీర్ వాంఖడే నటుడు షారుఖ్ ఖాన్ ను పెద్ద మొత్తంలో నగదు డిమాండ్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఆర్యన్ ఖాన్ నుంచి కేసు నుంచి తప్పించేందుకు మాజీ యాంటీ డ్రగ్ అధికారి సమీర్ వాంఖడే నటుడు షారుఖ్ ను నగదు డిమాండ్ చేశారని అభియోగాలు నమోదు చేసిన సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తాజాగా ఆయన అవినీతికి పాల్పడినట్లు నిర్దారణకు వచ్చిన అత్యుతన్నత దర్యాప్తు సంస్థ, సమీర్ వాంఖేడ్ పై కేసు నమోదు చేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7, 7A, 12, ఐపీసీలోని సెక్షన్లు 120B, 388 కింద కేసు నమోదైంది. సమీర్ వాంఖడేతో పాటు మరో ఇద్దరు అధికారుల మీద కూడా కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ, ముంబై, రాంచీ, లక్నో, గువహటి, చెన్నై సహా 30 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు.
షారుఖ్ నుంచి కోట్ల రూపాయలు లంచం డిమాండ్!
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్టు కాగానే, అతడి తండ్రి షారుఖ్ ఖాన్ కు సమీర్ విషయం చెప్పారు. రూ. 25 కోట్లు లంచం ఇస్తే కేసు నుంచి ఆర్యన్ ఖాన్ ను తప్పిస్తానని, లేకపోతే మీ కుమారుడు ఈ కేసు నుంచి బయటపడటం కష్టమేనని చెప్పినట్లు సమాచారం. సీబీఐ ప్రాథమిక విచారణలో పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో ఆర్యన్ ఖాన్ తో పాటు అతడి స్నేహితుడు అర్బాజ్ మర్చంట్ పేర్లను చివర్లో చేర్చినట్లు చేసినట్లు తెలుస్తోంది. అయితే ముడుపులు తీసుకుని కీలక నిందితులను సమీర్ వాంఖడే విడిచిపెట్టారన్న అభియోగాలతో పాటు ఆర్యన్ ఖాన్ ను కేసు నుంచి తప్పించేందుకు షారుఖ్ ఖాన్ ను కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలతో ఇదివరకే సీబీఐ రెండు పర్యాయాలు సమీర్ ను విచారించింది. మే 24న మరోసారి తమ ఎదుట విచారణకు హాజరుకావాలని సమీర్ వాంఖడేకు సమన్లు జారీ చేసింది సీబీఐ.