మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో లివర్ కూడా ఒకటి. అది ఆరోగ్యంగా ఉన్నప్పుడే.. మనం ప్రాణాలతో ఉండగలం. అది ఏ మాత్రం పాడైనా జీవితం దుర్భరమే. కాబట్టి.. కొన్ని సంకేతాలను ముందుగానే తెలుసుకోవడం ద్వారా కాలేయ సమస్యల నుంచి బయటపడొచ్చు.


ర్మం మీద నల్లని పిగ్మెంటేషన్, చర్మం ముదురు రంగులోకి మారి వెల్వెట్‌లా మారిపోవడాన్ని అకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. ఇది లివర్ కణాలు దెబ్బతిన్నాయనేందుకు సంకేతాలు.


మన దేశంలో మధుమేహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మధుమేహం శరీరంలోని ముఖ్యమైన అన్ని అవయవాల మీద తన ప్రభావాన్ని చూపుతుంది. డయాబెటిస్ వల్ల పాదాలు, అరచేతులు, నాడీవ్యవస్థ, కిడ్నీలు, కళ్ల వంటి చాలా అవయవాలను దెబ్బతీస్తుంది. అయితే లివర్ కూడా ఇలా డయాబెటిస్ వల్ల దెబ్బతింటుందనే అవగాహన చాలా మందికి లేదు.


మధుమేహం లివర్ డ్యామేజికి అత్యంత ముఖ్యకారణమని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య వల్ల కూడా కాలేయ సమస్యలు వస్తాయి. ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు లేకపోవడం, తగినంత వ్యాయామం లేకపోవడం, స్థూలకాయం వంటి కారణాలతో కాలెయ కణాలు దెబ్బతింటాయి.


లక్షణాలు


దురదృష్టం ఏమిటంటే లివర్ కణాల్లో సమస్య మొదలైన ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు కనిపించవు. కడుపులో నొప్పి, ఆకలి మందగించడం. కామెర్లు రావడం వంటి లక్షణాలు బయటపడే నాటికి లివర్ లో చాలా నష్టం జరిగిపోయి ఉంటుంది.


ఫోర్టిస్ సి-డాక్ హాస్పిటల్ ఫర్ డయాబెటిస్ అండ్ అలైడ్ సైన్సెస్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), డయాబెటిస్ ఫౌండేషన్ (ఇండియా), నేషనల్ డయాబెటిస్ ఒబేసిటీ అండ్ కొలెస్ట్రాల్ ఫౌండేషన్ (NDOC) పరిశోధకులు డయాబెటిస్ వల్ల లివర్ కణాల్లో జరిగే డ్యామేజి ని ప్రారంభ దశలోనే గుర్తించేందుకు అవసరమైన సూచనలు చేశారు.


చర్మం మొద్దుగా మారడం, ముదురు రంగు వెల్వెట్ వంటి ప్యాచెస్ ఏర్పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనిని అకాంథోసిస్ నైగ్రికన్స్ అని అంటారు. ఇలాంటి లక్షణాలు మెడపై కనిపిస్తాయి. అంతేకాదు బాహుమూలలు, మోచేతులు, మోకాలు, గజ్జాల్లో చర్మం నల్లగా వెల్వెట్ మాదిరిగా మారుతుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే లివర్ కణాల్లో డ్యామేజి మొదలైందని గుర్తించాలి. వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం అవసరం.


డయాబెటిస్ తో బాధపడుతూ చర్మం మీద ఇలాంటి సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం కూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో ఇప్పుడు మధుమేహుల సంఖ్య 10 కోట్ల పైచిలుకే. వీరితో పాటు 13.4 కోట్ల మంది ప్రీడయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు. గ్లైకోసైలెటెడ్ హిమోగ్లోబిన్ (HbA1C) గాఢత 7 శాతం కంటే ఎక్కువ కలిగిన వాళ్లే ఎక్కువ. మనదేశంలో మధుమేహుల్లో ఎక్కువ మందిలో HbA1C విలువలు 8 శాతానికి పై మాటే. మధుమేహానికి వంశపారంపర్య కారణాలతో పాటు అధిక బరువు, హైపర్ టెన్షన్ యూరిక్ ఆసిడ్ స్థాయి వంటి అనేక కారణాలు ఉన్నాయి.


Also Read : Beetroot for Men: బీట్ రూట్‌‌తో ఆ సామర్థ్యం పెరుగుతుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?







గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.