ఒంటి మీద దద్దుర్లు వస్తే ఒకప్పుడె స్మాల్ పాక్స్ అనో లేక చికెన్ పాక్స్ అనో అనుమానించేవారు. కానీ ఇప్పుడు మంకీ పాక్స్ ఏమో అని అనుమానించాల్సిన పరిస్థితి. మంకీ పాక్స్ ఆఫ్రికాలో పుట్టి అనేక దేశాలకు పాకింది. ఇదొక వైరల్ జూనోటిక్ వ్యాధి. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ దేశాలు, భారత్ దేశాలలో మంకీ పాక్స్ కేసులు బయటపడ్డాయి. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందడంపై ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆందోళనను వ్యక్తం చేసింది. దీని లక్షణాలు స్మాల్ పాక్స్ లక్షణాలలాగే ఉండడంతో మళ్లీ స్మాల్ పాక్స్ ప్రపంచంలో అడుగుపెట్టిందేమో అన్న కంగారు కూడా కలుగుతోంది. 


స్మాల్ పాక్స్ ఇంకా ఉందా?
1980లో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్మాల్ పాక్స్ పూర్తిగా అంతరించిపోయినట్టు ప్రకటించింది. స్మాల్ పాక్స్‌నే మశూచి అని కూడా పిలుస్తారు. దీనిలో చివరి కేసు 1977లో నమోదైంది. దాని తరువాత ఇంతవరకు ఒక్క కేసు కూడా లేదు. అందుకే దాన్ని పూర్తిగా నిర్మూలించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 


మంకీపాక్స్‌కు - స్మాల్ పాక్స్ మధ్య పోలికలేంటి?
మంకీపాక్స్ కూడా మశూచినే పోలి ఉంటుంది. ఇది ఆర్ధోపాక్స్ వైరస్ వల్ల కలుగుతుంది. స్మాల్ పాక్స్ లాగే మంకీ పాక్స్ సోకినా కూడా జ్వరం, తలనొప్పి, దద్దుర్లు,ఫ్లూ వంటి లక్షణాలు కలిగి ఉంటాయి. ఒక్కసారి వస్తే కనీసం మూడు వారాల పాటూ ఉంటుంది. అందుకే దీన్ని మశూచిగా భావించే ప్రమాదం ఉంది. 


తేడా ఏంటి?
మంకీ పాక్స్, మశూచి ఒకలాంటి లక్షణాలనే దాదాపు చూపిస్తాయి. కాకపోతే మంకీపాక్స్ వైరస్ సోకితే  లింఫ్ నోడ్స్ లో వాపు కనిపిస్తాయి. ఇవి మెడకు రెండు వైపులా ఉంటాయి. అలాగే మంకీ పాక్స్ ... ఈ వైరస్ సోకిన కోతి, ఎలుకలు, ఉడతలు నుంచి కూడా మనుషులకు వ్యాపిస్తుంది. ఆ జంతువు నుంచి వచ్చే ద్రవాలు, రక్తం, గాయాలతో ప్రత్యక్ష సంబంధం ఉంటే మనుషులకు వ్యాపిస్తుంది. మశూచి అలా సోకదు. 


మంకీపాక్స్ ఎలా సోకుతుంది?
వైరస్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలి బిందువులు వేరే వ్యక్తి శరీరంలో ప్రవేశించినా సోకుతుంది. లేదా ముద్దు పెట్టుకోవడం వల్ల శరీర ద్రవాల ద్వారా కూడా అంటుతుంది. ఇక వైరస్ సోకిన వ్యక్తితో లైంగిక సంబంధాలు పెట్టుకున్నా కూడా సోకుతుంది. ఆ వైరస్ ఉన్న పదార్థాలు, దుస్తుల వల్ల కూడా మనిషి శరీరంలో చేరుతుంది. 


Also read: గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజుకో అరటి పండు లాగించేయండి


Also read: పచ్చి పాలు తాగడం సురక్షితమేనా? పచ్చిగా తాగడం వల్ల సమస్యలు వస్తాయా?



గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.