చిగుళ్ళ నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన చాలా ఇబ్బందికర పరిస్థితులు. నలుగురిలో ఉన్నప్పుడు ఏదైనా తింటుంటే పళ్ల నుంచి రక్తం కారితే చూసే వాళ్ళు కూడా అసహ్యించుకుంటారు. నోటి శుభ్రత సరిగా లేదనే చెడు అభిప్రాయానికి వస్తారు. చిగుళ్ళ వ్యాధి జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఇది దంతాల నష్టానికి దారి తీయడమే కాకుండా డిమెన్షియా వంటి ప్రాణాంతక పరిస్థితులతో ముడి పది ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక నివేదిక ప్రకారం యూకేలోని పెద్దవారిలో సగం మంది చిగుళ్ళ వ్యాధితో బాధపడుతున్నారట. అంతే కాదు అక్కడ డెంటిస్ట్ దగ్గరకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే ఒక నెల జీతం చేతిలో పెట్టుకోవాల్సిందే అంటున్నారు.
చిగుళ్ళ వ్యాధిని ప్రారంభదశలోనే గుర్తిస్తే ఇంట్లోనే సులభంగా చికిత్స చేసుకోవచ్చు. అసలు ముందుగా చిగుళ్ళ వ్యాధి ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. చిగుళ్ళ వ్యాధిలో నాలుగు దశలు ఉన్నాయి. వాటిని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. ఆరోగ్యకరమైన చిగుళ్ళు పట్టుకున్నప్పుడు ధృడంగా ఉంటాయి.
చిగుళ్ళ వ్యాధి దశలు
క్లీవ్ ల్యాండ్ క్లినిక్ ప్రకారం.. చిగురు వాపు ఉన్నప్పుడు వ్యాధి ప్రారంభదశలో ఉందని అర్థం చేసుకోవాలి. బ్రష్ లేదా ఫ్లాస్ చేసినప్పుడు చిగుళ్ళు ఎర్రగా, ఉబ్బినట్టుగా మారి రక్తస్రావం జరగవచ్చు. ఇది మైల్డ్ పీరియాంటైటిస్ అని పిలిచే తదుపరి దశకు అభివృద్ధి చెందినప్పుడు చిగుళ్ళు నుంచి దంతాలు దూరంగా జరిగినట్టు కనిపిస్తాయి. దంతాల చుట్టు ఖాళీ ఏర్పడినట్టు గమనించవచ్చు.
ఇక మూడో దశలో ఖాళీ ప్రదేశంలో బ్యాక్టీరియా చేరిపోతుంది. పీరియాంటైటిస్ కి చికిత్స చేయకుండా వదిలేస్తే అది మరింత ముదిరిపోతుంది. ఇది జరిగినప్పుడు దంతాలు, చిగుళ్ళ మధ్య దాక్కున్న బ్యాక్టీరియా దంతాలు ఉంచే స్నాయువులు, మృదు కణజాలాలు, ఎముకలని నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఈ దశలో నోటి దుర్వాసన, కొంత నొప్పి కూడా అనుభవిస్తారు. ఇది వ్యాధి అధునాతన పీరియాంటైటిస్ గా మారుతుంది. దంతాలు వదులుగా మారిపోయి చివరికి ఊడిపోయే పరిస్థితికి వస్తుంది.
చిగుళ్ళ వ్యాధికి ఇంట్లోనే చికిత్స చేయడం ఎలా?
చికిత్స చేసుకునేందుకు ముందు ఎటువంటి చిగుళ్ళ వ్యాధి ఉందో తెలుసుకోవడం ముఖ్యం. ప్రారంభ దశ ఉంటే వ్యాధికి ఇంట్లోనే చికిత్స చేసుకోవచ్చు. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం రోజుకి కనీసం రెండు సార్లు ఫ్లోరైడ్ టూత్ పేస్ట్ తో దంతాలు శుభ్రం చేసుకోవాలి. టూత్ బ్రష్ ని ప్రతి ఒకటి నుంచి మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి. లేదంటే బ్రష్ వల్ల చిగుళ్ళ వ్యాధి మరింత సమస్యగా మారే అవకాశం ఉంది.
దంతాల పరిశుభ్రత కోసం డెంటిస్ట్ ని కలవడం ముఖ్యం. అవసరమైతే దంత వైద్యుడితో పళ్ళు శుభ్రం చేయించుకోవచ్చు. వ్యాధి తేలికపాటి స్థితిలో ఉన్నప్పుడు చికిత్స తీసుకుంటే బయట పడొచ్చు. లేదంటే తీవ్రమైన స్థితికి చేరి ఇబ్బందు పెడుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: వర్షాకాలంలో వేడివేడి సమోసా, పకోడీ తినాలని మనసు లాగేస్తోందా? కారణం ఇదే!
Join Us on Telegram:https://t.me/abpdesamofficial