Infosys Guidance Cut: 


ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌ (Infosys) షేర్లు శుక్రవారం భారీగా పతనం అవుతున్నాయి. ఇంట్రాడేలో ఏకంగా పది శాతం వరకు క్రాష్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే స్వల్పంగా కోలుకొని 8 శాతం పతనంతో ట్రేడవుతున్నాయి. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో అంచనాలు అందుకోవడంలో విఫలమవ్వడం, రెవెన్యూ గైడెన్స్‌లో కోత విధించడమే ఇందుకు కారణాలు! వీటికి తోడు బ్రోకరేజీ కంపెనీలు టార్గెట్లు, రేటింగ్‌ తగ్గించడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అయింది.


ఇన్ఫోసిస్‌ షేర్లు (Infosys Shares) శుక్రవారం ఉదయం రూ.1320 వద్ద మొదలయ్యాయి. రూ.1350 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకున్నాయి. రూ.1305 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని టచ్‌ చేశాయి. మధ్యాహ్నం ఒంటి గంటకు రూ.118 వరకు నష్టపోయి రూ.1331 వద్ద కొనసాగుతున్నాయి. ఏడాది నుంచీ ఇన్ఫీది ఇదే వరుస! రూ.1700-1300 రేంజులోనే కొనసాగుతోంది. ఏప్రిల్‌లో దాదాపుగా రూ.1200 స్థాయిని తాకింది. నెల రోజుల్నుంచి కొనుగోళ్ల మద్దతుతో రూ.1450కి చేరుకుంది. ఇప్పుడు ఫలితాల రాకతో మళ్లీ పతనం మొదలైంది.


గురువారం సాయంత్రం ఇన్ఫోసిస్‌ (Infosys Q1 Results) జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన రూ.5,945 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 10 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల ఆదాయం ఆర్జించింది. అయితే అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిలో ఉండటంతో 2024 ఆర్థిక ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను కంపెనీ కత్తిరించింది. కాన్‌స్టాంట్‌ కరెన్సీ విధానంలో గతంలో 4-7 శాతంగా ఉన్న ఆదాయం వృద్ధిరేటును 1-3.5 శాతానికి తగ్గించింది. చివరి త్రైమాసికంతో అమ్మకాల్లో వృద్ధిరేటు 1.3 శాతమే ఉంది. ఇక నికర ఆదాయం మూడు శాతం మేర తగ్గింది. కాన్‌స్టాంట్‌ కరెన్సీ విధానంలో అయితే ఆదాయం కేవలం ఒక శాతమే పెరిగింది. ఆపరేటింగ్‌ మార్జిన్‌ 20 బేసిస్‌ పాయింట్లు తగ్గి 20.8 శాతానికి చేరుకుంది.


రెవెన్యూ గైడెన్స్‌ కత్తిరించడంతో  నొమురా, మాక్వరీ వంటి బ్రోకరేజీ కంపెనీలు ఇన్ఫోసిస్‌ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. వ్యాపార ఒప్పందాల్లో నిరాశపర్చడంతో స్టాక్‌ను 'అండర్‌ పెర్ఫామ్‌'గా ప్రకటిస్తున్నామని మాక్వరీ తెలిపింది. చివరి త్రైమాసికంలో సాధించిన రెండు బిలియన్‌ డాలర్ల ఒప్పందాలు పెద్ద గొప్పేం కాదని అభిప్రాయపడింది. నొమురా సైతం పోర్టుఫోలియోలో కొన్ని షేర్లను అమ్ముకోవడం మంచిదని సూచించింది. రూ.1210కి టార్గెట్‌ తగ్గించింది. 'గైడెన్స్‌ను తగ్గించడం నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యాన్ని ప్రతిబింబిస్తోంది' అని తెలిపింది. ఇక జెఫరీస్‌, బ్యాంక్‌ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌, మోతిలాల్‌ ఓస్వాల్‌, నువామా ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌, హెచ్‌ఎస్‌బీసీ సైతం FY24/FY25 ఈపీఎస్‌ అంచనాలను 2-6 శాతానికి తగ్గించాయి.


Also Read: ఉద్యోగుల్ని భయపెట్టేందుకు! టాప్‌ పెర్ఫార్మర్‌ను పీకేసిన కంపెనీ!


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial