Viral News:
అంచనాలను మించి ఉద్యోగులు పనిచేస్తే కంపెనీలు ఏం చేస్తాయి? మనకు తెలిసినంత వరకు వారిని ప్రేమగా, గౌరవంగా చూసుకుంటాయి. మిగిలిన సహచరులకు ప్రేరణ కల్పించేందుకు వారిని బహిరంగంగా ప్రశంసిస్తాయి. వారి ప్రదర్శనను బట్టి ఎక్కువ కమిషన్, బోనస్‌లు ఇస్తుంటాయి. మంచి ఇంక్రిమెంట్లు ఇస్తాయి. వారికి పదోన్నతులు ఇస్తుంటాయి.
కానీ.. ఓ కంపెనీ ఇందుకు విరుద్ధంగా ప్రవర్తించింది! తమకున్న పవర్ ఏంటో మిగతా ఉద్యోగులకు చూపించాలని అనుకుంది. తాము తల్చుకుంటే ఎవరినైనా ఉద్యోగంలోంచి ఉన్నపళంగా గెంటేస్తామని ప్రకటించింది. మిగిలిన సహచరులను భయపెట్టి లొంగదీసుకొని అదుపులో ఉంచుకొనేందుకు మెరుగ్గా పనిచేస్తున్న ఉద్యోగిని గెంటేసింది. ఈ ఉదంతాన్ని ఒకరు రెడిట్ ప్లాట్‌ఫామ్‌లో (Reddit)లో షేర్ చేసుకున్నారు. అదిప్పుడు వైరల్‌గా మారింది.
'నిజాయతీగా చెప్తున్నా! ప్రస్తుతం నేను పని చేస్తున్న కంపెనీ ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయి. పై స్థాయిలోని యాజమాన్యం ఉద్యోగుల కమిషన్లను దోచుకుంటోంది. ఒప్పందం నిబంధనలను పాటించడం లేదు. ఉద్యోగుల్ని వేధిస్తున్నారు. బాత్‌రూమ్‌లో ఐదు నిమిషాల కన్నా ఎక్కువ గడిపితే వచ్చి తలుపు తడుతున్నారు. మీకు ఇష్టమున్నా లేకపోయినా మేం తలుపులు తెరిచే ఉంచుతాం' అని రెడిట్ మెంబర్ పేర్కొన్నారు.
'డీమోటివేట్ అయ్యానని ఒకరోజు నన్ను ఉద్యోగం నుంచి తొలగిస్తామని భయపెట్టారు. నా కమిషన్ డబ్బును దోచుకోవడంతోనే నేను ప్రేరణ కోల్పోయాను. ఇప్పుడేమో అమ్మకాల్లో నా తర్వాత స్థానంలో నిలిచిన టాప్ పెర్ఫార్మర్‌ను తొలగించారు. కంపెనీ అంచనాలను అందుకోలేదు కాబట్టి గెంటేశామని అధికారికంగా చెబుతున్నారు. అయితే కమిషన్లు, కాంట్రాక్టు ఒప్పందాల కోసం యాజమాన్యంతో గొడవపడొద్దనే ఇలా చేశామని నా డైరెక్ట్ మేనేజర్ చెప్పారు. కావాలనుకుంటే ఎవరినైనా ఫైర్ చేస్తామని ఉదాహరణగా చూపించేందుకే ఇలా చేశామని చెప్పారు' అని ఆ రెడిట్ మెంబర్ తెలిపారు.
మొత్తంగా ఈ పోస్టుకు 800కు పైగా అప్ ఓట్స్ వచ్చాయి. 150 మందికి పైగా కామెంట్లు పెట్టారు. హీనంగా ప్రవర్తించిన కంపెనీ యాజమాన్యాన్ని విమర్శించారు. ఇలాంటి పద్ధతులు అనైతికమని పేర్కొన్నారు. 'ఆ ఉద్యోగికి వచ్చే భారీ కమిషన్‌ను దోచుకొనేందుకే టాప్ పెర్ఫార్మర్‌ను తొలగించారు. మిమ్మల్ని బెదిరించేందుకు దానిని ఉదాహరణగా చూపించారు' అని వారి పోస్టుకు ఒకరు బదులిచ్చారు. 'ఇదొక ఓపెన్ అండ్ షట్ కేసు. క్రిమినల్ కేసులు పెట్టేందుకు వీల్లేకపోవడం సిగ్గుచేటు' అని ఇంకొకరు తెలిపారు.
Also Read: నెట్‌వెబ్ టెక్నాలజీస్ ఐపీవోకు 90 రెట్లు బిడ్లు! లిస్టింగ్ మామూలుగా ఉండదిక!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial