పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘బ్రో’. ఈ మల్టీ స్టారర్ మూవీకి నటుడు సముద్ర ఖని దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్ పలు విషయాలు వెల్లడించారు. మెగా ఫ్యామిలీకి చెందిన ఇద్దరు పెద్ద హీరోలతో కలిసి పని చేయడం ఎలా ఉంది? ఈ సినిమా తమ దగ్గరికి ఎలా వచ్చింది? పవన్ కల్యాణ్ ఈ సినిమాకు ఎలా ప్లస్ కాబోతున్నారు? అనే అంశాల గురించి వివరించారు.


పవన్ రియల్ లైఫ్ ఇమేజ్ ఎంతో ఉపయోగపడుతుంది!


“తాము ఓ సినిమా చేయాలని అని భావిస్తున్నప్పుడు దర్శకుడు త్రివిక్రమ్, సముద్రఖని తమిళంలో చేసిన ఓ ప్రాజెక్టును మాకు రెఫర్ చేశారు. అదే తమిళ ఒ మూవీ ‘వినోదయ సీతం’. ఇది చాలా చిన్న సినిమా. కేవలం 20 రోజుల వ్యవధిలో షూట్ చేశారు.  కానీ, మంచి కంటెంట్ ఉంది. ఈ సినిమాను మన ప్రేక్షకులకు అనుకూలంగా ఉండేలా తీయాలి అనుకున్నాం. సముద్రఖనినే దర్శకుడిగా తీసుకున్నాం. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ ను హీరోలుగా అనుకున్నాం. అనుకున్నట్లుగానే ఈ సినిమా తెలుగులో చక్కగా రూపొందింది. ఇందులో ఎమోషన్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్  పాత్ర, అతడి నటన ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా తొలి ఆరు నిమిషాలు మినహా మిగతా రన్ టైమ్ అంతా పవన్ కల్యాణ్ ఉంటారు. పవన్ రియల్ లైఫ్ ఇమేజ్ ఈ సినిమాకు చాలా ఉపయోగపడుతుంది. ‘బ్రో’ ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా రీచ్ అవుతుంది” అన్నారు విశ్వప్రసాద్.


‘బ్రో’ సినిమాకు ఏపీలో ఏ ఇబ్బంది ఉండదు!


అటు ఏపీ రాజకీయాల్లో పవన్ కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ‘బ్రో’ సినిమాపై ఏమైనా ప్రభావం పడే అవకాశం ఉందా? అనే ప్రశ్నకు నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఆసక్తికర విషయాలు చెప్పారు. తాను సినిమాలను, రాజకీయాలను వేర్వేరుగా చూస్తానని చెప్పారు. “సినిమాలపై ప్రభావం చూపే కొన్ని సంఘటనలు ఉండవచ్చు. కానీ, ‘బ్రో’ సినిమాకు ఆంధ్రప్రదేశ్‌లో అలాంటి పరిస్థితి ఎదురవుతుందని నేను అనుకోను. ‘వకీల్ సాబ్‌’ విషయంలో కొంత ఇబ్బంది ఎదురయ్యింది. అది పునరావృతం అవుతుందని నేను అనుకోను. ‘బ్రో’ మా బడ్జెట్‌లోనే నిర్మించాం. థియేటర్లలో టిక్కెట్ ధరలను పెంచే ప్రతిపాదన ఏదీ చేయలేదు. అదనపు మొత్తం డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదనపు షోలు కావాలని కోరలేదు. అందుకే, ఈ సినిమాకు ఎలాంటి ఇబ్బందు ఎదురుకావు అని భావిస్తున్నాం" అని చెప్పారు.


‘బ్రో’ సినిమాను  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.   ప్రియా ప్రకాష్ వారియర్, కేతికా శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 28న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.   


Read Also: ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు‘బ్రో’- క్లీన్ ‘యు’ సర్టిఫికేట్ ఇచ్చిన సెన్సార్ బోర్డు!




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.



Join Us on Telegram: https://t.me/abpdesamofficial