తెలుగు రాష్ట్రాల్లో ముసురు కమ్మేసింది. నాలుగు రోజుల నుంచి పడుతున్న వర్షాలు రైతులకు ఆనందాన్ని పంచుతోంది. నైరుతి రుతుపవనాలు ముందుగానే తెలుగు రాష్ట్రాలకు తాకినా సరైన వానల్లేక వ్యవసాయం ఇబ్బంది పడింది. అయితే నాలుగైదు రోజుల నుంచి ఊపందుకున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి.   


స్థానికంగా కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి ఉద్దృతి పెరుగుతోంది. గోదావరితోపాటు శబరి నదుల్లో వరద ఉద్దృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రవాహం జోరుగా ఉంది.  ఈ ప్రవాహం 43 అడుగులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. 


గోదావరి ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రవాహం పెరిగితే అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. 


భారీ వర్షాలకు తెలంగాణ వ్యాప్తంగా జిల్లాల్లో చెరువులు వాగులు నిండిపోయాయి. ఖమ్మంలో చాలా వరకు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. కొత్తగూడెం, మణుగూరులో బొగ్గు ఉత్పత్తికి వర్షం అంతరాయంగా మారింది. భూపాలపల్లిలోని కేటికే 2,3 ఓపెన్‌ కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తిని నిలిపేశారు. వరంగల్ జిల్లాలో కొన్ని గ్రామాల్లో చెరువులు తెగి రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. 


ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్ ఇచ్చిన సమాచారం మేరకు ఒడిశా మీదుగా కొనసాగుతున్న అల్పపీడనం వల్లో చినుకులు, తేలికపాటి వర్షాలే ఉంటాయన్నారు. ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ​, ఎన్.టీ.ఆర్. జిల్లాల్లో చినుకులు, తేలికపాటి వర్షాలుంటాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూడొచ్చు.