మానవ శరీరంలో నీరు చాలా ముఖ్యమైన భాగం. దాదాపు 70 శాతం నీరు శరీరంలో ఉంటుంది. అన్ని అవయవాల పనితీరు సక్రమంగా ఉండాలంటే తప్పనిసరిగా తగినంత నీరు తాగాలి. లేదంటే శరీరం డీహైడ్రేషన్ కి గురవుతుంది. వేసవి కాలంలో అయితే ఎండ వేడి తట్టుకోలేక ఎక్కువగా నీటిని తాగుతారు. నీరు చెమట రూపంలో బయటకి పోతూ ఉండటం వల్ల మళ్ళీ దాన్ని తిరిగి పొందడానికి నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతారు. మరి చలికాలం పరిస్థితి ఏంటి? అసలే చల్లని వాతావరణం ఇంకా నీళ్ళు తాగడం అంటే అమ్మో మా వల్ల కాదు అని అనుకుంటారు కొందరు. నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల మూత్రం ఎక్కువగా వస్తుందని మరికొందరు దాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ శరీరం డీహైడ్రేషన్ నుంచి నివారించడానికి ప్రతిరోజు తప్పనిసరిగా 8-10 గ్లాసుల నీళ్ళు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


డీహైడ్రేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది?


అలసట, అనేక దీర్ఘకాలిక వ్యాధులకి డీహైడ్రేషన్ కారణం అవుతుంది. అనారోగ్యాలకు గురి కావడమే కాకుండా శరీరంలోని శక్తిని హరించివేస్తుంది. ఒక్కోసారి ప్రాణాల  మీదకి తెస్తుంది. శరీరంలో నీతి శాతం తగ్గినప్పుడు చక్కెర, లవణాలు వంటి ఖనిజల సమతుల్యతని దెబ్బతీస్తుంది. ఇది శరీర పనితీరుని ప్రభావితం చేస్తుంది. డీహైడ్రేట్ కి గురయినప్పుడు కనిపించే సంకేతాలు..


☀విపరీతమైన దాహం 


☀నోరు పొడిబారిపోవడం


☀విపరీతమైన అలసట


☀ముదురు రంగు మూత్రం


☀మూత్రం దుర్వాసన రావడం


☀సాధారణం కంటే తక్కువ మూత్ర విసర్జన చెయ్యడం


శీతాకాలంలో నీరు ఎంత అవసరం?


వాతావరణం చల్లగా ఉండటం వల్ల చెమట తక్కువగా పడుతుంది. వేసవి కాలంతో పోలిస్తే చలి కాలంలో ద్రవాల వినియోగం తక్కువగా ఉంటుంది. చలికాలంలో దాహం తక్కువగా అనిపిస్తుంది. అందుకే అటువంటి సమయంలో శరీరం త్వరగా డీహైడ్రేట్ కి గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తారు. ఎక్కువగా నీళ్ళు తాగలేము అనుకునే వాళ్ళు వాటిని వేరే విధంగా తాగొచ్చు. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం కోసం తగిన పోషకాలు అందించే వేడి టీలు, సూప్ లు వంటి ఇతర అనేక మార్గాల ద్వారా నీటిని తీసుకోవచ్చు. కనీసం నాలుగు కప్పుల గ్రీన్ టీ లేదా రేడు గిన్నెల సూప్ తీసుకుంటే హైడ్రేట్ గా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.


హైడ్రేట్ గా ఉండేందుకు చిట్కాలు


సూప్: శీతాకాలంలో హైడ్రేట్ గా ఉండటానికి సీజనల్ కూరగాయలు, మాంసంతో సూప్ చేసుకుని తాగొచ్చు. సూప్ లో ప్రోటీన్లు, వితమిన్లతో పాటు నీరు కూడా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడుతుంది. పోషకాహారాన్ని పెంచడం కోసం బచ్చలి కూర, క్యారెట్లు, బీన్స్ వంటి కూరగాయలు జోడించుకోవచ్చు.


నిమ్మకాయ నీళ్ళు: పరి రోజు తేనె, నిమ్మకాయతో కలిపిన్ గోరువెచ్చని నీటిని తీసుకోవచ్చు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో పాటు కొవ్వు కరిగేందుకు సహాయపడుతుంది. తేనె, నిమ్మరసం రెండూ శరీరానికి ఫ్లూ లేదా ఇతర ఇన్ఫెక్షన్లకి వ్యతిరేకంగా పోరాడుతుంది.


గ్రీన్ టీ: హైడ్రేషన్ తో పాటు ఫ్రీ రాడికల్స్ ను దూరంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లని అందించే గ్రీన్ టీ తాగొచ్చు. సహజ నీటివనరులైన పండ్లు, కూరగాయలు మీ ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచేందుకు సహాయపడతాయి.  


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?