సాధారణంగా కొంతమంది సీజన్ ని బట్టి చన్నీళ్ళు లేదా వేడి నీళ్ళతో స్నానం చేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఎంత చలిగా ఉన్నా కూడా చన్నీటితోనే స్నానం చేస్తారు. అప్పుడే వాళ్ళకి హాయిగా ఉంటుందని అనుకుంటారు. ఇక్కడ కూడా ఒక వ్యక్తి అదే విధంగా చేశాడు. 68 ఏళ్ల వ్యక్తి చన్నీటితో స్నానం చేయడం వల్ల బీపీ పెరిగిపోయి బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యాడు.


చన్నీళ్లతో స్నానం చేయడం ప్రమాదమా?


చలికాలంలో చన్నీళ్లతో స్నానం చెయ్యడం ప్రమాదమే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. జలుబు, రక్తపోటు పెరిగి రక్తనాళాలు సంకోచిస్తాయి. దాని వల్ల గుండె పోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి. మంటను తగ్గిస్తుంది, నొప్పుల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది, అలసట తగ్గిస్తుంది, ఒత్తిడి నుంచి బయట పడేస్తుంది. కానీ శీతాకాలంలో మాత్రం చేయడం ఒకరకంగా ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టినట్టే అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


అలా స్నానం చేయడం వల్ల కండరాలకి తగినంత రక్తం లభించనప్పుడు లేదా రక్తం గడ్డ కట్టడం వల్ల బ్లాక్ అయినప్పుడు గుండె పోటు లేదా స్ట్రోక్ సంభవిస్తుంది. ఇది ఆక్సిజన్ సరఫరాని తగ్గిస్తుంది. ప్రమాదకరమైన పరిణామాలకి దారి తీస్తుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ కి దారితీసే కారణాలు అనేకం ఉన్నాయి. వయస్సు, కుటుంబ చరిత, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల కూడా ఇది సంభవించవచ్చు. ప్రత్యేకించి శీతాకాలంలో చన్నీటితో స్నానం చేస్తే బీపీ పెరిగి స్ట్రోక్ రావచ్చని నిపుణులు వెల్లడించారు.


చన్నీళ్ళు ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?


గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు అసలు చన్నీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది. అకస్మాత్తుగా చల్లని నీటిని తాకడం వల్ల శరీరం తట్టుకోలేదు. దీని వల్ల చర్మంలోని రక్త నాళాలు సంకోచిస్తాయి. రక్త ప్రవాహాన్ని నెమ్మదించేలా చేస్తాయి. అందువల్ల శరీరం చుట్టూ రక్తాన్ని సరఫరా చెయ్యడానికి గుండె వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. తన దగ్గరకి వచ్చిన ఒక పేషెంట్ ఇలాగే చన్నీటితో స్నానం చేసి మరణించిన ఘటన గురించి ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పుకొచ్చారు. 68 ఏళ్ల వ్యక్తి చన్నీటి స్నానం చేస్తున్నప్పుడు అధిక రక్తపోటుతో బ్రెయిన్ స్ట్రోక్ గురయ్యాడని తెలిపారు.


శీతాకాలంలో స్ట్రోక్ తగ్గించే మార్గాలు


ప్రతి సంవత్సరం దాదాపు 18 లక్షల కేసులు స్ట్రోక్ కేసులు నమోదవుతున్నాయి. ప్రత్యేకించి శీతాకాలంలో చల్లని నీటితో స్నానం చేయకుండా ఉండాలి. ఎప్పుడూ వెచ్చని లేదా గోరువెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.


శరీరం వెచ్చగా ఉంచుకోవాలి: చల్లని వాతావరణంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే శరీరం ఎప్పుడు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.


వ్యాయామం తప్పనిసరి: శరీరం చురుకుగా ఉండేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు చెయ్యాలి. రన్నింగ్, జాగింగ్, ఏరోబిక్స్, యోగా, డాన్స్, మెడిటేషన్ వంటివి చేసుకోవచ్చు. రెగ్యులర్ వ్యాయామం శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది, ఫిట్ గా ఉండేందుకు సహాయపడుతుంది.


ఆరోగ్యకరమైన ఆహరం తీసుకోవాలి: తాజా సీజనల్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయాలు తీసుకోవాలి. చక్కెర, కొలెస్ట్రాల్ పెంచే ఆహారానికి దూరంగా ఉండాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని నివారించాలి. రోజువారీ ఆహారంలో అల్లం చేర్చుకోవాలి.


ఆల్కహాల్ ని నివారించాలి: అతిగా మద్యం సేవించకూడదు. ధూమపానం కూడా నివారించాలి. గుండె సమస్యల్ని ఈ అలవాట్లు మరింత పెంచుతాయి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: పురుషత్వానికి సవాల్, స్పెర్మ్ కౌంట్ భారీగా పతనం - షాకింగ్ న్యూస్ చెప్పిన కొత్త అధ్యయనం