పిల్లల్ని కనే విషయంలో భార్య మాత్రమే ఆరోగ్యంగా ఉంటే సరిపోతూ భర్త కూడా ఉండాలి. ఇద్దరిలోని పునరుత్పత్తి కణాలు సక్రమంగా ఉన్నప్పుడే బిడ్డలని కనగలుగుతారు. ఏ ఒక్కరిలో లోపం ఉన్నా కూడా అది సాధ్యపడదు. ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్(వీర్య కణాలు) తగ్గిపోతుంది. భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మగవారు ఎదుర్కొంటున్న సమస్య ఇదేనని అంతర్జాతీయ పరిశోధకుల బృందం వెల్లడించింది. దీనిపై అధ్యయనం విడుదల చేసింది. స్పెర్మ్ కౌంట్ అనేది మానవ సంతానోత్పత్తికి మాత్రమే కాదు పురుషుల ఆరోగ్యానికి కూడా సూచిక.


కౌంట్ తగ్గడం వల్ల ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, వృషణ క్యాన్సర్, జీవితకాలం తగ్గే ప్రమాదంతో ముడిపడి ఉందని పరిశోధకులు తెలిపారు. ఈ క్షీణత వల్ల మానవ జాతుల మనుగడని కొత్త చిక్కుల్లోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తున్నారు. హ్యూమన్ రిప్రొడక్షన్ అప్‌డేట్ జర్నల్‌లో 53 దేశాల డేటాను సేకరించి ఈ అధ్యయనం నిర్వహించారు. అమెరికా, ఆశీయామ్ ఆఫ్రికాలోని పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పై దృషి పెట్టారు. ఉత్తర అమెరికా, యూరప్, ఆస్ట్రేలియాలో గతంలో చూసిన మొత్తం స్పెర్మ్ గణనలు (TSC),  స్పెర్మ్ ఏకాగ్రత (SC)లో గణనీయమైన క్షీణతను గుర్తించారు. భారత్ లో కూడా ఇదే విధంగా క్షీణత ఉన్నట్లు పరిశోధకులు తెలిపారు.


మొత్తం మీద గత 46 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా స్పెర్మ్ గణనలు 50 శాతానికి పైగా క్షీణించడాన్ని గమనించినట్లు ఇజ్రాయెల్ కి చెందిన ప్రొఫెసర్ లెవిన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్షీణత ఇటీవల సంవత్సరాలలో వేగవంతమైందని అన్నారు. అయితే ఈ క్షీణతకి గల కారణాలు పరిశీలించనప్పటికి అది సంతానోత్పత్తి అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడతాయని ఆయన చెప్పుకొచ్చారు. తీవ్రమైన ఈ సమస్యని త్వరగా పరిష్కరించపోతే మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


ఆరోగ్యకరమైన వాతావరణం ప్రోత్సహించడానికి, పునరుత్పత్తికి ముప్పు కలిగించే వాటిని తగ్గించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇదే కొనసాగితే మాత్రం భవిష్యత్ లో తీవ్ర అనార్థాలు సంభవించే అవకాశం లేకపోలేదని అన్నారు. భారత్ లోనూ ఇటువంటి పరిస్థితే ఉందని అందులో ఎటువంటి మార్పులు లేవని తెలిపారు.


వీర్య కణాల సంఖ్య తగ్గడం వల్ల వచ్చే సమస్యలు


స్పెర్మ్ కౌంట్ తగ్గడం వల్ల పురుషుల సంతానోత్పత్తిని ప్రభావితం చేయడం మాత్రమే కాకుండా వారి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ కి చెందిన మరో ప్రొఫెసర్ హెచ్చరిస్తున్నారు. వృషణ క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, జననేంద్రియ పుట్టుక లోపాలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అంతే కాదు దాని ప్రభావం స్త్రీ పునరుత్పత్తి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇలా తక్కువ స్పెర్మ్ కౌంట్‌ను కలిగి ఉన్న సమస్యను ‘ఒలిగోస్పెర్మియా’ అంటారు. 


కౌంట్ తగ్గించే కారణాలు


ఆల్కహాల్, ప్రాసెస్డ్ మీట్, పాల ఉత్పత్తుల వల్ల వీటి సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అతిగా శుద్ది చేసిన మాంసం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. వీర్య కణాలు చురుగ్గా కదలవు. వెన్న తీయని పాలల్లో అధికంగా ఈస్ట్రోజెన్ ఉంటుంది. అలాగే పాల ఉత్పత్తిని పెంచడానికి ఆవులకు స్టెరాయిడ్లు కూడా ఇస్తుంటారు. ఈ రెండింటి వల్ల వీర్య కణాల నాణ్యత తగ్గిపోతుంది. కాబట్టి వెన్న తీసేసిన పాలనే తాగాలి.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: నెలసరి నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టొచ్చు