World Idly Day: ప్రతి ఏడాది మార్చి 30వ తేదీ ఇడ్లీకే అంకితం. ఆ రోజున చాలా చోట్ల రకరకాల ఇడ్లీలు తయారవుతుంటాయి. వాటిని తినేందుకు భోజన ప్రియులు బారులు తీరుతారు. నూనె లేకుండా జీరో కొలెస్ట్రాల్‌తో చేసే ఇడ్లీ మనం తినే అన్ని బ్రేక్‌ఫా‌స్ట్‌లలో బెస్ట్ అని ఇప్పటికే వైద్యులు చెబుతున్నారు. అసలు మార్చి 30న ఇడ్లీ దినోత్సవం అని ఎవరు ప్రకటించారో తెలుసా? ఒక ఇడ్లీ అమ్మే వ్యక్తి. 


కోయంబత్తూరుకు చెందిన వ్యక్తి ఇనియవాన్. చదువు పెద్దగా అబ్బలేదు. దీంతో ఎనిమిదో తరగతిలోనే స్కూలుకు బైబై చెప్పేశాడు. బతకడం కోసం చిన్న హోటళ్లలో కప్పులు కడిగే పని చేశారు. సంపాదన అంతంతమాత్రంగానే ఉండేది. దీంతో అద్దెకు కొన్నాళ్ల పాటూ ఆటో నడిపాడు. ఓరోజు ఆటోలో ఇడ్లీలమ్మే ఒక మహిళ ఎక్కింది. తనతో ఇడ్లీ, చట్నీల పాత్రలను తీసుకెళ్తోంది. ఆమెను ఆ వ్యాపారం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఇడ్లీలు తిన్నాక కస్టమర్లు బాగున్నాయని చెబుతారని, తన ఇడ్లీల కోసం వేచి ఉండే వాళ్లు ఉన్నారని చెప్పింది. దీంతో ఇడ్లీ హోటల్ పెట్టాలని నిర్ణయించుకున్నాడు ఇనియవాన్. 


కోయంబత్తూర్ నుంచి చెన్నై వెళ్లిపోయి అక్కడ చిన్న పాకలో ఇడ్లీ హోటల్ తెరిచాడు. కానీ హోటల్ మొదలు పెట్టిన రోజు పెద్ద వర్షం పడి మొత్తం వస్తువులన్నీ తడిసిపోయాయి. వర్షాలు తగ్గేవరకు ఆగి, మళ్లీ హోటల్ తెరిచాడు. ఇడ్లీలు తయారుచేసి అమ్మడం మొదలుపెట్టాడు. కస్టమర్లు వినియోగదారులు రావడం మొదలుపెట్టారు.


వెరైటీ ఇడ్లీలతో...
తాను అందరిలాగే ఇడ్లీలు చేస్తే ప్రత్యేకత ఏముంది. అందుకే కొత్తగా ఆలోచించి బాదం, నారింజ, మొక్కజొన్న పిండి, కొబ్బరి, చాకొలెట్ ఇలా రకరకాల ఇడ్లీలు చేయడం మొదలుపెట్టాడు. కస్టమర్లకు ఆ ఇడ్లీలు నచ్చి విపరీతంగా రావడం మొదలుపెట్టారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇతను తయారుచేసిన 20 కి పైగా ఇడ్లీలకు పేటెంట్ హక్కులను అందుకున్నాడు. ప్రస్తుతం కూడా అతని ఇడ్లీ షాపు చెన్నైలో ఉంది. దాని పేరు ‘మల్లి పూ’. 


అతని పుట్టినరోజే...
ఇడ్లీ తయారీలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు ఇనియవాన్. రెండు వేలకు పైగా ఇడ్లీ రకాలను తయారుచేశాడు. అందుకే అతనికి ‘ఇడ్లీ మ్యాన్’ అంటారు. అతని పుట్టిన రోజు మార్చి 30. 2015లో అతని పుట్టినరోజునే ‘వరల్డ్ ఇడ్లీ డే’గా ప్రకటించింది తమిళనాడు కుకింగ్ వెల్ఫేర్ అసోసియేషన్. 


Also read: నా భార్య డబ్బు మొత్తం ఖర్చుపెట్టేస్తోంది, ఆమెను మార్చడం ఎలా?



Also read: బొప్పాయి తినడం వల్ల నిజంగా గర్భస్రావం జరుగుతుందా? ఇది ఎంతవరకు నిజం


















































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.