ఏలూరు జిల్లా భీమడోలు వద్ద దురంతో ఎక్స్‌ప్రెస్ రైలు మహీంద్రా బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. గురువారం తెల్లవారుఝామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భీమడోలు జంక్షన్‌ వద్ద రైల్వే గేటును సిబ్బంది మూసివేయగా.. అదే సమయంలో బొలెరోలో వచ్చిన కొంతమంది వ్యక్తులు రైల్వే గేటును ఢీకొట్టి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆ వాహనం రైల్వే ట్రాక్‌పైకి వచ్చి ఆగింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్‌ దూసుకొస్తుండడంతో ఆ వ్యక్తులు బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు. రైలు ఢీకొట్టడంతో ఆ వాహనం నుజ్జునుజ్జు అయింది. అయితే, బొలెరో వాహనాన్ని అక్కడే వదిలేసి పోవడం చూస్తే వారు దొంగలనే అనుమానం కలుగుతోంది.


అయితే, ప్రమాదం జరిగిన తర్వాత దురంతో ఎక్స్‌ప్రెస్ దాదాపు ఆరు గంటల పాటు నిలిచిపోయింది. సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన తర్వాత కేవలం మూడు చోట్ల మాత్రమే ఈ రైలు నిలుస్తుంది. గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఈ మూడు రైల్వే స్టేషన్లలోనే రైలు ఆగుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే రాజమండ్రి వెళ్లాల్సిన కొందరు ప్రయాణికులు వేరే వేరే వాహనాల్లో వెళ్లిపోయారు. విశాఖ వెళ్లాల్సిన ప్రయాణికులు మాత్రం స్టేషన్‌లోనే పడిగాపులుకాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ప్రమాదంపై భిన్న వాదనలు వినిస్తున్నాయి. ప్రమాదానికి గురైన వాహనాన్ని గత రాత్రి హైవే పోలీసులు వెంబడించడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. 


గేదెలు దొంగలించే ముఠా ఈ వాహనంలో ప్రయాణిస్తున్నారన్న అనుమానంతో హైవే పోలీసులు వెంబడించినట్లు సమాచారం. ఆ భయంతోనే రైల్వే గేటును ఢీకొట్టి పారిపోయేందుకు వాహనంలో ఉన్న వారు యత్నించారు. అయితే వాహనం ఇంజిన్ నిలిచిపోవడంతో పట్టాలపైనే వాహనం నిలిచిపోయింది. అదే సమయంలో దురంతో ఎక్స్‌ప్రెస్ రావడంతో బొలెరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో వాహనం చిత్తుచిత్తుగా మారిపోయింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.