కర్ణాటక ఎలక్షన్స్ షెడ్యూల్ వచ్చేసింది. 224 అసెంబ్లీ స్థానాలకుగానూ మే 10న ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ మరోసారి అధికారన్ని నిలబెట్టుకోవాలని ట్రే చేస్తుంటే...గతంలో అధికారంలోకి వచ్చినా నిలబెట్టుకోలేకపోయిన కాంగ్రెస్, జేడీఎస్ మరో అవకాశం ఇవ్వమంటూ ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ ఓ తెలుగు లీడర్ తీసుకుని నిర్ణయం ఏంటని ఇప్పుడు ఆ రెండు పార్టీలు వెయిట్ చేస్తున్నాయి. ఆ పేరే పవన్ కల్యాణ్. జనసేన అధినేత. ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ప్రాబల్యమే ఎక్కువ. బళ్లారి దగ్గర మొదలుపెట్టి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. మరి ఆ తెలుగు ఓట్లను ప్రభావితం చేసేలా స్టార్ క్యాంపెయినర్ గా పవన్ ఉపయోగపడతారా..పడితే అది ఏ పార్టీకి. ఇప్పుడిదే హాట్ టాపిక్.


2014 జనరల్ ఎలక్షన్స్ టైమ్ లో  జనసేన, టీడీపీ, బీజేపీ అలయన్స్ లో ఉన్నాయి. అందులో భాగంగా ప్రధాని మోదీ ఆదేశాల మేరకు పవన్ కల్యాణ్‌ కర్ణాటక ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించారు. తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు ప్రభావితమయ్యేలా ఉద్వేగభరిత ప్రసంగాలను చేసి ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మేలు చేశారు. అయితే ఆ తర్వాత ఏపీలో తమ కూటమి అధికారంలోకి రావటంతో పవన్ మళ్లీ సినిమాలు, పాలిటిక్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు.


2019 ఎలక్షన్స్ టైమ్ నాటికి బీజేపీ, టీడీపీల దోస్తానా కు కట్ చెప్పిన పవన్ కల్యాణ్‌, వామపక్షాలు బీఎస్పీతో కలిసి ఏపీ ఎన్నికల్లో బరిలోకి దిగారు. అంతకు ఏడాది ముందు జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ ప్రచారానికి వెళ్లకుండా వ్యూహాత్మకంగా సైలెంట్ అయిపోయారు పవన్ కల్యాణ్‌. జేడీఎస్ నేతలతో టచ్ లో ఉన్నారని..దేవెగౌడ, కుమారస్వామికి మద్దతుగా కర్ణాటకలో ప్రచారం చేస్తారనే ప్రచారం సాగినా...జనసేన ఆ ప్రచారాన్ని ఖండించింది. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్‌ కూటమి అధికారంలోకి రావటం..ప్రభుత్వం కూలిపోయి బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకోవటం జరిగిపోయాయి.


ఇప్పుడు మళ్లీ కర్ణాటక ఎలక్షన్స్...ఆంధ్రలో 2019 ఎన్నికల తర్వాత మళ్లీ బీజేపీతో కలిసి పవన్ కల్యాణ్...ఇప్పుడు అంతే సఖ్యతగా ఆ పార్టీతో ఉన్నారా..లేరా అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి ఇలాంటి టైమ్ లో బీజేపీ కోసం మళ్లీ పవన్ కల్యాణ్ కర్ణాటకకు వెళతారా..లేదా బీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామన్న జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం చేస్తారా..? పోనీ చంద్రబాబులా న్యూట్రల్ గానో..గత స్ట్రాటజీనే వర్కవుట్ చేస్తూ మళ్లీ సైలెంట్ గానే ఉండిపోతారా...పవన్ కల్యాణ్ ఏం డెసిషన్ తీసుకోనున్నారు.? వారాహి కర్ణాటకలోనూ అడుగుపెడుతుందా? ఈ ప్రశ్నలే జనసేన దాని అధినేత పవన్ కల్యాణ్ చుట్టూ ఇప్పుడు అలుముకుని ఉన్నాయి.


కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ABP CVoter Opinion Poll వెల్లడించింది. దాదాపు అన్ని కీలకప్రాంతాల్లో ఈ పార్టీకే మెజార్టీ దక్కుతుందని తెలిపింది. సీట్ల పరంగా చూస్తే...గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 80 సీట్లు వచ్చాయి. బీజేపీ 104 చోట్ల విజయం సాధించింది. జేడీఎస్ 37 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, జేడీఎస్ కలిసి అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ఆ తరవాత బీజేపీ చేతుల్లోకి అధికారం మారిపోయింది. అయితే...ప్రస్తుత అంచనాల ప్రకారం చూస్తే...కాంగ్రెస్‌కు 121 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి. బీజేపీకి 74,JDSకి 29 సీట్లు దక్కనున్నట్టు ఈ సర్వేలో తేలింది. మొత్తంగా చూస్తే...కాంగ్రెస్‌కు 115 నుంచి 127 సీట్లు, బీజేపీకి 68 నుంచి 80,JDSకి 23 నుంచి 35 సీట్లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.