ప్రశ్న: మాకు పెళ్లయి ఆరేళ్లవుతుంది. నా భర్త మంచివాడే, కానీ వ్యక్తిగత శుభ్రత పాటించడు. చెమట పట్టినా కూడా స్నానం చేయడు. కొన్ని రోజులు వరకు స్నానం చేయకుండా అలాగే ఉంటాడు. ఫ్యాన్ లేదా ఏసీ వేసుకుని చెమట తగ్గించుకుంటాడు కానీ స్నానం చేయడానికి మాత్రం ఇష్టపడడు. దుస్తులు కూడా ఒకే డ్రెస్సును వారం రోజుల పాటూ వేస్తాడు. అతడి దగ్గరికి వెళితే చాలు దుర్వాసన వస్తూ ఉంటుంది. అతనితో శారీరకంగా కలవడానికి నేను నిరాకరించే పరిస్థితి వచ్చింది. నేను పరిశుభ్రంగా ఉండేందుకు ఇష్టపడతాను. కానీ నా భర్త మాత్రం అపరిశుభ్రంగా ఉండేందుకే ఇష్టపడతాడు. జుట్టు దువ్వుకోవడం, పెర్య్వూమ్స్, ఫేస్ క్రీమ్ వంటివి వాడడం చేయడు. నా భర్త కుటుంబంలోని మగవారంతా ఇలాగే ఉంటారు. నేను నా భర్తతో శారీరకంగా కలిసేందుకు ఇష్టపడడం లేదు. దీంతో ఆయనలో అసహనం, కోపం వంటివి పెరిగిపోతున్నాయి. దీని వల్ల మా ఇద్దరి మధ్య గొడవలు పెరుగుతున్నాయి. ఈ ఒక్క కారణంగా నేను విడాకులు తీసుకోలేను, అలా అని అతనితో కలిసి ఉండలేకపోతున్నాను. ఇది వినడానికి చిన్న సమస్యగా అనిపించినా అతని అపరిశుభ్రతను భరించడం చాలా కష్టంగా ఉంది నాకు. ఏం చేయాలో సూచించండి.


జవాబు: దాంపత్యంలో కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారుతాయి. అవే పెను సమస్యలుగా మారి విడాకులకు దారి తీస్తాయి. మీ విషయంలో అతని అపరిశుభ్రత మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుందన్న సంగతి. పరిశుభ్రంగా ఉండే వారిని ఎవరైనా ఇష్టపడతారు. కానీ కనీసం స్నానం కూడా చేయడానికి ఇష్టపడని భర్తను మీరు ఆరేళ్ల నుండి భరిస్తున్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించమని చెప్పడం తప్పు కాదు, కానీ ఆ విషయాన్ని అతను ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదు. ఇంట్లో పెద్దవారికి చెప్పి సమస్యను పరిష్కరించమని చెబుదామనుకున్నా... కుటుంబంలో మగ వారంతా ఇదే తీరుగా ఉంటారని మీరు చెబుతున్నారు, దీనివల్ల పెద్దవారికి చెప్పినా పెద్దగా మీకు ఒరిగేదేం లేదు. శారీరకంగా కలవడం అనేది పూర్తిగా మనస్ఫూర్తిగా చేయాల్సిన పని. మీరు మనసు చంపుకొని ఇన్నాళ్లు చేయాల్సి రావడం దురదృష్టకరమే. అయితే ఈ విషయాన్ని మీరు ఆయనకి నేరుగా చెప్పారో లేదో మాకు ఇక్కడ తెలియజేయలేదు. ఒకవేళ చెప్పకపోతే ముందు ఆ విషయాన్ని చెప్పండి. మీరు ఆయనకు శారీరకంగా ఎందుకు దూరంగా ఉండాల్సి వస్తుందో వివరించండి. వ్యక్తిగత పరిశుభ్రత ఎందుకు అవసరమో చెప్పండి.


చాలామంది మగవారు ఇలా అపరిశుభ్రంగా ఉండడం వల్లే మీ భర్తకు సైతం అదే అలవాటు వచ్చినట్లు ఉంది. కాబట్టి మార్చుకోవడానికి సమయం పడుతుంది. మీరు గత ఆరు సంవత్సరాలుగా అతని అలవాటు మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొంత కాలం ప్రయత్నించడానికి ఓపిక పట్టండి. ఎంతకీ పరిస్థితులు మారకపోతే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌కు వెళ్లడం చాలా ముఖ్యం. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో అతనికి అర్థమయ్యే విధంగా మానసిక నిపుణులు ఆలోచనల్లో, అలవాట్లలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. వ్యక్తిగత పరిశుభ్రత ఎంత ముఖ్యమో వివరిస్తారు. అయితే ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు లేదా మానసిక నిపుణులను కలిసేందుకు అతను నిరాకరించవచ్చు. కాబట్టి ముందుగా వారిని కలిసేందుకు అతడిని సిద్ధం చేయండి.  


మీకు పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారి దగ్గర కూడా మీరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ముఖ్యమని మీ భర్తకు చెప్పండి. మీ భర్తను చూసి వాళ్ళు కూడా అపరిశుభ్రంగా ఉండడం నేర్చుకుంటారని చెప్పండి. ఇది వారికి భవిష్యత్తులో ప్రమాదకరంగా మారుతుందని ఎన్నో వైరస్‌లు, బ్యాక్టీరియాలు శరీరంలో చేరే అవకాశం ఉందని వివరించండి. రోజుల తరబడి స్నానం చేయకపోవడం అనేది చాలా వ్యతిరేకతను పెంచే అంశమే. ఆ విషయాన్ని ఆయనకు తెలియజేయండి. రోజూ స్నానం చేయడం చాలా ముఖ్యమని, పరిశుభ్రంగా కనిపించడం వల్ల సంఘంలో గౌరవం పెరుగుతుందని వివరించండి.



Also read: పిల్లలకే కాదు పెద్దవారు కూడా కచ్చితంగా తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు ఇవిగో






































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.