YSRCP News :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీగా మరింత జోష్‌లో ఉండాల్సిన ఆ పార్టీ .. క్యాడర్‌లో ఉత్సాహం కనిపించక డీలా పడుతోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్లేందుకు చేపట్టిన కార్యక్రమాల్లో దేంట్లేనూ క్యాడర్ ను భాగం చేయలేదు. వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులే చూసుకున్నారు. దీంతో వారంతా నిద్రాణంగా మారిపోయారు. ఆ పరిస్థితి గుర్తించి ఇప్పుడు వారందర్నీ మళ్లీ యాక్టివ్ చేసేందుకు వైఎస్ఆర్‌సీపీ అనుబంధ సంఘాల చీఫ్ విజయసాయిరెడ్డి రంగంలోకి దిగారు. వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. 


నాలుగేళ్లుగా నిరాశలో వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ 
 
విజయసాయిరెడ్డి ఇటీవల అనుబంధ సంఘాలతో విస్తృతంగా సమావేశం అవుతున్నారు.   .  యువత, విద్యార్థి, మహిళ, కార్మిక, డాక్టర్ ఇలా అనేక రకాల అనుబంధ సంఘాలు ఎన్నికలకు ముందు విస్తృతంగా పని చేశాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దగా పని లేకపోవడంతో వారు సైలెంట్ అయిపోయారు. వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను పట్టించుకోలేదన్న భావన ఆ పార్టీ క్యాడర్ లో ఎక్కువ ఉంది. వాలంటీర్లను నియమించి.. అన్ని బాధ్యతలు వారికే ఇచ్చారు. దీంతో వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలకు తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న ఆనందం లేకుండా పోయింది. అదే సమయంలో సీఎం జగన్ .. ద్వితీయ శ్రేణి నాయకత్వానికి చాలా దూరంగా వెళ్లారు. ఎమ్మెల్యేలనే కలవడం కష్టంగా మారింది. ఇక స్థానిక నేతల్ని కలుస్తారా ?
 
కీలకమైన బూత్ ఇంచార్జులనూ పక్కన పెట్టేశారన్న విమర్శలు !


అధికారంలోకి వచ్చాక పార్టీకి క్యాడర్ ఉందన్న సంగతిని జగన్ మర్చిపోయారని చాలా కాలంగా ఆ పార్టీలో విమర్శలు ఉన్నాయి. అన్నీ వాలంటీర్లే చేస్తున్నారు. బూత్ ఇంచార్జులకూ పని లేదు . ఇప్పుడు మళ్లీ అందరి అవసరం పడింది. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితిని మార్చి మళ్లీ ద్వితీయ శ్రేణి నేతల్ని పూర్తి స్థాయిలో యాక్టివ్ చేసేందుకు సీఎం జగన్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల గృహసారధుల్ని నియమించాలని ఆదేశించారు. ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రత్యేకంగా ద్వితీయ శ్రేణి నేతలతో మాట్లాడాలని అనుకుంటున్నారు. నియోజకవర్గాల సమీక్షలు చేస్తున్నప్పుడు ఒక్కో నియోజకవర్గం నుంచి యాభై మంది ద్వితీయ శ్రేణి నేతల్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు పిలిపిస్తున్నారు. అయితే అవి తరచుగా జరగడం లేదు. అందుకే సీఎం జగన్ జిల్లా పర్యటనకు వెళ్లే సందర్భంలో స్థానిక శాసససభ్యులతోపాటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్యమైన ద్వితీయ స్థాయి నాయకులకు కూడా ఆ సమావేశంలో పాల్గొనేందుకు ఆహ్వానించాలని నిర్ణయించారు. అయితే ఇది కూడా అంత చురుకుగా సాగడం లేదు. 


సోషల్ మీడియా కార్యకర్తల కోసం వైసీపీ ప్రయత్నాలు !


మరో వైపు  వైసీపీ సోషల్ మీడియా బలగం కూడా తగ్గిపోయింది.  కరెంట్  చార్జీలపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతూంటే.. సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నారు. దీంతో పరిస్థితిని గమించిన సోషల్ మీడియా చీఫ్ సజ్జల భార్గవ.. చదువుకుని ఐటీ ఉద్యోగాలు చేసే వారి నుంచి వారియర్స్ ను ఎంపిక చేసుకోవాలనుకున్నారు. బెంగళూరు, చెన్నై , హైదరాబాద్‌లో సమావేశాలు పెట్టి ఐటీ ఉద్యోగుల్ని వైసీపీ కోసం పని చేయమని సూచించారు. కనీసం లక్ష మందిని  అయినా సోషల్ మీడియా వారియర్స్ ను పెట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఇందులోనూ అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి.  మొత్తంగా పార్టీ అనుబంధ సంఘాలను యాక్టివేట్ చేయడం.. విజయసాయిరెడ్డికి పెద్ద సవాల్ గా మారింది. క్యాడర్ అసంతృప్తిని తగ్గించడమే ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారిపోయింది.