BRS vs Congress in Telangana | కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ స్పీడ్ తగ్గితే... కాంగ్రెస్ దూకుడు పెరిగింది. రాష్ట్ర స్థాయిలో బీఆర్ఎస్ స్వరం కూడా మారింది. ఇలా గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల వెనుక గల ఆంతర్యమేంటో ఆ వివరాలపై ఓ లుక్కేయండి. 


ఇదొక్కటి అనే కాదు.. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ టార్గెట్ గా కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. ధరణిని తీసివేస్తామన్న కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో కలపాలని పిలుపునిస్తున్నారు. మెున్నటి వరకు బీజేపీ ధోరణి, బీజేపీ లీడర్లపై విరుచుకుపడే బీఆర్ఎస్ నేతలు కూడా... ఇప్పుడు డైవర్షన్ తీసుకుని కాంగ్రెస్ పార్టీపైనే ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే... కర్ణాటకలో విజయంతో తెలంగాణ కాంగ్రెస్ లో జోష్ వచ్చింది. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఉన్న నాయకుల్ని చేర్చుకోవంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అవుతోంది. ఈ తరుణంలో బలమైన క్యాడర్ లేని బీజేపీ కంటే.. కాంగ్రెస్ తోనే ఎక్కువ ప్రమాదమని బీఆర్ఎస్ గుర్తించినట్లుంది. అందుకే కాంగ్రెస్ పై అస్త్రాలు ఎక్కుపెడుతోంది.


తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్త జోష్ వచ్చింది. డీకే శివకుమార్- సిద్ధరామయ్యల స్ఫూర్తితో సీనియర్ లీడర్లు అంతా కలిసి పని చేస్తున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అలా లీడర్లు అంతా కలిసి పాల్గొంటున్నారు. మరోవైపు.. ఆపరేషన్ కమలం పెద్దగా వర్కౌట్ అవకపోవడంతో ఆపరేషన్ హస్తం చేపట్టింది. ఇప్పటికే పొంగులేటి, జూపల్లి కృష్ణారావులు పార్టీలే చేరేలా మంతనాలు పూర్తి చేశారు. రేపో మాపో వారిద్దరు హస్తం గూటికి చేరనున్నారు. వీరితో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గుర్నాథ్ రెడ్డిలు సైతం హస్తం పార్టీకి టచ్ లో ఉన్నారు. మరోవైపు తాండురు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో విభేదాలు ఉన్న పట్నం మహేందర్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇలా బీఆర్ఎస్ కు ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లే అవుతుందనే సంకేతం.. ఇతర పార్టీల్లోని నాయకులకు పంపిస్తున్నట్లైంది. 



కర్ణాటకలో మాదిరి సంక్షేమమే లక్ష్యంగా మ్యానిఫెస్టో తయారు చేస్తున్నారు. ధరణి తీసిస్తాం. 2 లక్షల వరకు రుణమాఫీ అంటూ రైతుల్ని ఆకర్షించే పనిలో పడ్డారు. అలాగే, మహిళలకు తెలంగాణ అంతటా ఉచిత బస్సు ప్రయాణం అంటూ మహిళలను కూడా ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ లోని ప్రియాంక గాంధీ తెలంగాణ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో.. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతానికైతే.. బీఆర్ఎస్ కాకపోతే అధికారంలోకి వచ్చే తామే అన్న భావనను జనాల్లోకి హస్తం పార్టీ గట్టిగానే తీసుకెళ్తుంది. ఇదే జోరు మున్ముందు కొనసాగితే... ఎన్నికల్లో ట్రై యాంగిల్ పోరు కాదు. కారు వెర్సస్ హస్తం యుద్ధమే జరగొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.