చాలామంది చిన్న పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్లు అనుకుంటారు. కానీ మారుతున్న కాలంలో పెద్దవారికి కూడా వ్యాక్సిన్ల రక్షణ చాలా అవసరం. దీనినే అడల్ట్ వ్యాక్సినేషన్ అంటారు. యువత నుంచి వృద్ధాప్యం వరకు చాలా రకాల వ్యాక్సిన్లు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అవేంటో తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఆ వ్యాక్సిన్లు వేసుకోవడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. చిన్నపిల్లలకు DPT వ్యాక్సిన్ వేస్తూ ఉంటారు. ఇది డిఫ్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం వంటివి రాకుండా అడ్డుకోవడానికి ఇస్తుంటారు. ఇదే వ్యాక్సిన్ పెద్దవారికి కూడా ఉంది. దాన్ని Tdap అంటారు. ఈ వ్యాక్సిన్ ను 11 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలకు ఖచ్చితంగా ఇప్పించాలి. ఆ తర్వాత ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన అవసరం ఉంది.
మహిళలు కచ్చితంగా గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌కు సంబంధించిన వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్... హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఈ వైరస్ ను నివారించేందుకు HPV వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది కేవలం సర్వైకల్ క్యాన్సర్ కోసమే కాదు, ఆడవారిలో వచ్చే వెజైనల్ క్యాన్సర్,వల్వెవ్ క్యాన్సర్ కూడా అడ్డుకుంటుంది. ఈ వ్యాక్సిన్ ను 9 ఏళ్ల నుంచి 45 సంవత్సరాల లోపు వయసున్న మహిళలు కచ్చితంగా తీసుకోవాలి.
వానాకాలం మొదలైందంటే అనేక వైరల్ ఇన్ఫెక్షన్లు రావడం మొదలుపడతాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు వ్యాన్సిన్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. దీన్ని ఫ్లూ షాట్ అని కూడా పిలుస్తారు. ఇది తీసుకోవడం వల్ల వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
చికెన్ పాక్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్ వల్లే వస్తుంది. దీన్ని మనం ఆటలమ్మ, అమ్మవారు అని పిలుస్తాము. చిన్నప్పుడే వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తారు. ఒకవేళ చిన్నప్పుడు తీసుకోకపోతే 13 ఏళ్లు దాటిన తర్వాత ఈ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. దీన్ని వారిసెల్లా వ్యాక్సిన్ అంటారు. ఇది రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది.
న్యూమోకోకల్ అనే వ్యాధి కూడా ఎక్కువమందిని వేధిస్తోంది. దీన్ని నిరోధించడానికి న్యూమో కోకల్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కచ్చితంగా ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. లేకుంటే ఈ బ్యాక్టీరియా త్వరగా దాడి చేస్తుంది.
జ్వరం నుంచి తప్పించుకునేందుకు టైఫాయిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పిల్లలతో పాటు పెద్దలు కూడా అనేక రకాల వ్యాక్సిన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని కచ్చితంగా అందరూ తీసుకోవాలి.
Also read: వేసవిలో పొట్ట అప్‌సెట్ అవుతోందా? అయితే తినాల్సిన ఆహారాలు, తినకూడని పదార్థాలు తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.