Belly Fat Burning Exercise : నేటి బిజీ లైఫ్‌స్టైల్, క్రమరహితంగా తీసుకునే ఆహారం, స్ట్రెస్ వంటి వాటివల్ల పొట్ట పెరగడం ఒక సాధారణ సమస్యగా మారిపోయింది. మగవారే కాదు ఆడవారు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దానిని తగ్గించుకునేందుకు చాలామంది జిమ్‌కు వెళ్లాలనుకుంటారు కానీ.. సమయం లేకపోవడం, డబ్బులు సరిపోవు అనే ఇబ్బందులతో వెళ్లలేరు. అలాంటివారు ఇంట్లోనే కూర్చొని చేయగలిగే ఒక ప్రభావవంతమైన వ్యాయామం ఉంది. అదే కపాలభాతి (Kapalbhati)ప్రాణాయామం. ఇది పొట్ట కొవ్వును తగ్గించడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

డాక్టర్ శివ కుమార్ మాట్లాడుతూ.. "కపాలభాతి అనేది ఒక వ్యాయామం. దీనిని చేయడం ద్వారా మొత్తం శరీరం ఫిట్‌గా ఉంటుంది. అలాగే మీ పొట్ట కూడా తగ్గుతుంది. సులభంగా దానిని కంట్రోల్ చేసుకోవచ్చు. దీనికోసం ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే.. కూర్చోనే చేయగలిగే ఎఫెక్టివ్ ఆసనం ఇది" అని తెలిపారు. మరి కపాలభాతి పొట్టను ఎలా తగ్గిస్తుంది? దానివల్ల కలిగే లాభాలు ఏంటి? దీనిని ఎలా చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

కపాలభాతి పొట్ట కొవ్వును ఎలా తగ్గిస్తుందంటే..

  • రోజూ కపాలభాతి ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తే.. పొట్ట కండరాలు సక్రియం అవుతాయి.
  • ప్రతిసారీ గట్టిగా గాలిని వదిలినప్పుడు.. అది పొట్ట లోపలి భాగాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల అక్కడ పేరుకుపోయిన కొవ్వు నెమ్మదిగా కరగడం ప్రారంభమవుతుంది.
  • ఇది మెటబాలిజంను పెంచుతుంది. దీనివల్ల క్యాలరీలు కూడా వేగంగా బర్న్ అవుతాయి. బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది. 
  • పొట్ట చుట్టూ ఉండే గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. దీనివల్ల పొట్ట లోపలికి వెళ్తుంది.

కపాలభాతిని ఎలా చేయాలి

  • కపాలభాతిని చేసేందుకు శుభ్రమైన ప్రదేశం ఎంచుకోవాలి. అక్కడ సుఖాసన లేదా పద్మాసనంలో కూర్చోవాలి.
  • ఇప్పుడు వెన్నుముకను నిటారుగా ఉంచి కళ్లు మూసుకోవాలి.
  • శ్వాస తీసుకోండి. ఆపై ముక్కు ద్వారా గాలిని వేగంగా వదలండి.
  • గాలిని వదిలేటప్పుడు పొట్టను లోపలికి లాగండి.
  • ఈ ప్రక్రియను నిరంతరం చేయండి. 2 నిమిషాల నుంచి ప్రారంభించి దీనిని నెమ్మదిగా 15 నిమిషాల వరకు పెంచవచ్చు. 

కపాలభాతితో కలిగే ఇతర ప్రయోజనాలు

  • మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో మంచి ఫలితాలు ఇస్తుంది.
  • ముఖానికి మెరుపును తెస్తుంది. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది.
  • పొట్టలో గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

పొట్ట పెరగకూడదని భావించేవారు.. చురుకుగా, ఫిట్‌గా ఉండాలని కోరుకునేవారు కచ్చితంగా ఈ కపాలభాతి ప్రాణాయామాన్ని మీ రొటీన్​లో భాగం చేసుకోండి. కేవలం 10 నుంచి 15 నిమిషాలు కేటాయిస్తే పొట్టతగ్గడమే కాకుండా పూర్తి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. పైగా ఇంట్లోనే చేసుకోగలిగే ఈ సింపుల్ ఆసనం ఎవరైనా చేయవచ్చు. ప్రెగ్నెన్సీతో ఉండేవారు మాత్రం నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.