Koneru Humpy vs Divya Deshmukh: FIDE చెస్ ప్రపంచ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. చెస్ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారత క్రీడాకారిణిగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. ఫైనల్ చేరిన రెండో భారత క్రీడాకారిణిగా తెలుగు తేజం, గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి నిలిచింది. అంంతకు ముందు ఫిడె చెస్ వరల్డ్ కప్ సెమీఫైనల్లోకి ప్రవేశించిన తొలి భారత క్రీడాకారిణిగా కోనేరు హంపి చరిత్ర సృష్టించగా, ఈ జాబితాలో రెండో క్రీడాకారిణిగా దివ్య దేశ్‌ముఖ్ నిలిచింది. 

భారతదేశానికి చెందిన గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ఫిడే చెస్ ప్రపంచ కప్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం రాత్రి జరిగిన సెమీ-ఫైనల్ టై బ్రేక్‌లో చైనాకు చెందిన టింగ్‌జీ లేయిని ఓడించి కోనేరు హంపి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ విజయంతో కోనేరు వచ్చే ఏడాది జరగనున్న కాండిడేట్స్ టోర్నమెంట్‌కు నేరుగా అర్హత సాధించారు. ఫైనల్లో భారత్‌కే చెందిన దివ్య దేశ్‌ముఖ్‌తో హంపి తలపడనుంది.

తొలిసారి ఫైనల్ చేరిన కోనేరు హంపి 

చెస్‌ ప్రపంచకప్‌లో రెండో సెమీఫైనల్ జూలై 23న (బుధవారం) భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, చైనాకు చెందిన టింగ్‌జీ లేయి మధ్య జరిగింది. అయితే ఈ సెమీఫైనల్‌లో 2 క్లాసికల్ లెగ్‌లు డ్రాగా ముగియడంతో ఫలితాన్ని తేల్చడానికి టై బ్రేక్‌ నిర్వహించాల్సి వచ్చింది.  గురువారం రాత్రి జరిగిన టైబ్రేక్‌లో చైనా క్రీడాకారిణి టింగ్‌జీని 5-3 తేడాతో ఓడించి కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకుంది. చెస్ వరల్డ్ కప్‌లో ఫైనల్ చేరడం ఆమెకు ఇదే తొలిసారి.

ఫైనల్లో దివ్య దేశ్‌ముఖ్‌ వర్సెస్ కోనేరు హంపి..

ఫిడే మహిళల చెస్ వరల్డ్ కప్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. తొలిసారి ఇద్దరు భారత క్రీడాకారిణులు ఫైనల్ చేరుకున్నారు. తెలుగు తేజం, భారత గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి, 19 ఏళ్ల టీనేజ్ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌ ఫైనల్లో తలపడనున్నాయి. FIDE మహిళల చెస్ ప్రపంచ కప్‌ ఫైనల్ చేరుకున్న తొలి భారత క్రీడాకారిణి దివ్య. గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సైతం ప్రపంచ ఛాంపియన్, మాజీ ఛాంపియన్లను ఓడించి ఫైనల్ చేరింది. చెస్ వరల్డ్ కప్ ఫైనల్లో ఇద్దరు భారత క్రీడాకారిణులు తలపడనుండటంతో ప్రపంచం దృష్టి వీరి ఫైనల్ మ్యాచ్‌పై పడింది. 

ఫైనల్ చేరిన దివ్య దేశ్‌ముఖ్ 

భారత ప్లేయర్ దివ్య దేశ్‌ముఖ్ బుధవారం జరిగిన తలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన టాన్ జోంగ్జిని ఓడించి మహిళ వరల్డ్ కప్ ఫైనల్ చేరింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన 19 ఏళ్ల టీనేజ్ సంచలనం FIDE చెస్ ప్రపంచ కప్‌ ఫైనల్ చేరిన మొదటి భారత క్రీడాకారిణి. తొలి టైటిల్ నెగ్గాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి ఫైనల్‌కు చేరుకోవడంతో ఈసారి చెస్ వరల్డ్ కప్ విజేతగా భారత్ నిలవనుంది.