Ind Vs Eng Manchestar Test Latest Updates: ఇండియాతో జ‌రుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ భారీ స్కోరుపై క‌న్నేసింది. గురువారం రెండో రోజు ఆట‌ముగిసేస‌రికి 46 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల‌కు 225 ప‌రుగులు చేసింది. ఇంగ్లాండ్ ఇంకా 133 పరుగుల వెనుకంజలో ఉంది. క్రీజులో ఒల్లీ పోప్ (20), జో రూట్ (11) ఉన్నారు.  ఓపెన‌ర్ బెన్ డ‌కెట్ (100 బంతుల్లో 94, 13 ఫోర్లు)త్రుటిలో సెంచ‌రీని చేజార్చుకున్నాడు. అరంగేట్ర బౌల‌ర్ అన్షుల్ కాంబోజ్ త‌న‌ను ఔట్ చేశాడు. అంత‌కుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 358 ప‌రుగుల‌కు ఆలౌటైంది. వ‌న్ డౌన్ బ్యాట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (61) కెరీర్ లో తొలి అర్ద సెంచ‌రీతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. 

ఓపెన‌ర్ల శుభారంభం..ఈ సిరీస్ లో తొలి టెస్టు త‌ర్వాత విఫ‌ల‌మైన ఇంగ్లాండ్ ఓపెన‌ర్లు డ‌కెట్.. జాక్ క్రాలీ (113 బంతుల్లో 84, 13 ఫోర్లు, 1 సిక్స‌ర్) ఇంగ్లాండ్ కు తొలి ఇన్నింగ్స్ లో అద్భుత‌మైన ఆరంభాన్నిచ్చారు. ఆరంభంలో జ‌స్ ప్రీత్ బుమ్రాను ఆచి తూచి ఆడిన ఈ ఓపెన‌ర్లు మిగ‌తా బౌల‌ర్ల‌ను మాత్రం చిత‌క్కొట్టారు. ముఖ్యంగా డ‌కెట్ వ‌న్డే త‌ర‌హాలో ఆడుతూ.. మ‌రోసారి బ‌జ్ బాల్ ను రుచి చూపించాడు. దీంతో వికెట్ న‌ష్ట‌పోకుండానే టీ విరామానికి వెళ్లింది. ఆ త‌ర్వాత కూడా ఈ ఓపెన‌ర్ల జోరు త‌గ్గ‌లేదు. ముందుగా డ‌కెట్, ఆ త‌ర్వాత క్రాలీ అర్ద సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ జోడీని విడ‌దీసేందుకు భార‌త కెప్టెన్ శుభ‌మాన్ గిల్ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా ఫ‌లితం లేక‌పోయింది. 

ఎట్టకేల‌కు..జోరుగా సాగుతున్న ఈ భాగ‌స్వామ్యాన్ని ఎట్టకేల‌కు ర‌వీంద్ర జ‌డేజా విడ‌దీశాడు. నిల‌క‌డ‌గా ఆడుతున్న క్రాలీని క్యాచ్ ఔట్ చేసి, జ‌డేజా ఔట్ చేశాడు. దీంతో 166 ప‌రుగుల భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. మ‌రోవైపు సెంచ‌రీ వైపు దూసుకెళ్తున్న డ‌కెట్ ను అన్షుల్ కాంబోజ్ బోల్తా కొట్టించాడు. అన్షుల్ వేసిన బంతిని క‌ట్ చేయ‌బోగా, కాస్త ఎక్కువ ఎత్తులో వ‌చ్చిన బంతి ఎడ్జ్ ను ముద్దాడుతూ కీప‌ర్ ధ్రువ్ జురెల్ చేతుల్లో ప‌డింది. ఆ తర్వాత రూట్, పోప్ జంట.. మరో వికెట్ పడకుండా రోజును ముగించింది. అబేధ్యమైన మూడో వికెట్ కు వీరిద్దరూ 28 పరుగులు జోడించారు. అంత‌కుముందు రెండో రోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 264/4 తో తొలి ఇన్నింగ్స్ ను కొన‌సాగించిన భార‌త్ .. 358 ప‌రుగుల‌కు ఆలౌటైంది. సుద‌ర్శ‌న్ తో పాటు రిష‌భ్ పంత్ (54), శార్దూల్ ఠాకూర్ (41) రాణించారు. మిగ‌తా ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ కు మూడు వికెట్లు ద‌క్కాయి. ఇక ఐదు టెస్టుల అండ‌ర్స‌న్-టెండూల్క‌ర్ ట్రోఫీలో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగ‌తి తెలిసిందే.