Ind Vs Eng Manchestar Test Day 2 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇండియా తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించింది. గురువారం రెండోరోజు లంచ్ విరామం తర్వాత కాసేపటికి 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌటైంది. వన్ డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ అర్ధ సెంచరీ (151 బంతుల్లో 61, 7 ఫోర్లు) తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (5/72) ఐదు వికెట్ల ప్రదర్శనతో మరోసారి బంతితో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో గాయం తర్వాత బరిలోకి దిగిన రిషభ్ పంత్ (54) అద్భుత ఫిఫ్టీతో ఆకట్టుకున్నాడు. తన పోరాటంతో భారత అభిమానులనే కాకుండా, క్రికెట్ ప్రేమికులను కూడా అలరించాడు.
ఠాకూర్ జోరు..గురువారం ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (20)ను జోఫ్రా ఆర్చర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్ (41) బ్యాట్ తో ఆకట్టుకున్నాడు. నిన్న వాషింగ్టన్ సుందర్ కంటే ముందుగా వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచినా, బ్యాట్ తో సత్తా చాటి ఆ నిర్ణయానికి న్యాయం చేశాడు. వాషింగ్టన్ సుందర్ (27) తో కలిసి జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో ఆచి తూచి ఆడిన ఠాకూర్.. తర్వాత బౌండరీలతో రెచ్చి పోయాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 48 పరుగులు జోడించారు. ఆ తర్వాత స్టోక్స్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు.
పంత్ పోరాటం..తొలిరోజు బంతి కాలికి తాకి, ఫ్రాక్చర్ కావడంతో పెవిలియన్ కు వెళ్లిపోయిన పంత్.. ఠాకూర్ ఔటైన తర్వాత వచ్చి, అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఒకవైపు కుంటుతూనే సింగిల్స్ తీసి, తనలోని పోరాట పటిమను చాటాడు. ఆ తర్వాత ఒక సిక్సర్, ఫోర్ కొట్టి టెస్టుల్లో మరో ఫిఫ్టీని సాధించాడు. లంచ్ విరామం తర్వాత పంత్ ను ఔట్ చేయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు పదే పదే తన కాలిని టార్గెట్ చేసుకుని ప్రయత్నించినా, పోరాట పటిమతో వాళ్ల ప్రణాళికలను చిత్త చేశాడు. ఈ దశలో అంతవరకు ఓపికగా ఆడిన వాషింగ్టన్ పుల్ షాట్ కి ప్రయత్నించి ఔటయ్యాడు. డెబ్యూటెంట్ అన్షుల్ కాంబోజ్ డకౌటయ్యాడు. ఆ తర్వాత కాస్త వేగంగా పరుగులు సాధించాలని ప్రయత్నించి పంత్ ఔటయ్యాడు. ఆఖర్లో జస్ ప్రీత్ బుమ్రా (4) ఫోర్ కొట్టడంతో 350 మార్కు దాటింది.. ఆ తర్వాత తను కూడా ఔట్ కావడంతో భారత ఇన్నింగ్స్ ముగిసింది. మిగతా బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ కు మూడు వికెట్లు దక్కాయి.