ప్రపంచవ్యాప్తంగా మహిళల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక విజయాలను గౌరవించడానికి ఏటా మార్చి 8న “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” జరుపుకుంటారు. ఈరోజుని కొన్ని దేశాలు సెలవు దినంగా ప్రకటించారు. లింగ సమానత్వం, హింస, మహిళలకు సమాన హక్కులు కావాలంటూ ఎంతో మంది ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నారు. మహిళా దినోత్సవం పుట్టుక వెనుక దాదాపు 15 వేల మంది అతివల అడుగులు ఉన్నాయి. పురుషులతో సమానమైన హక్కుల కావాలంటూ 1908 లో న్యూయార్క్ లో భారీ ఎత్తు ప్రదర్శన నిర్వహించారు. అలా 1909 లో అమెరికాకు చెందిన సోషలిస్టు పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఇది అప్పుడు అమెరికాకు మాత్రమే పరిమితమైంది.


ఈ ఏడాది థీమ్ ఇదే


ప్రతి ఏడాది ఏదో ఒక థీమ్ తో మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. గతేడాది ‘బ్రేక్ ద బయాస్: వివక్షను బద్ధలకొడదాం. ఆడపిల్ల విద్యని ప్రోత్సహించడం, సమాజంలోని అన్ని విభాగాల నుంచి లింగ పక్షపాతాన్ని తొలగించాలనే ఉద్దేశంతో ఈ థీమ్ పెట్టారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు దూసుకుపోతూ పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నా ఎక్కడో ఒక చోట వివక్షత ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆ వివక్ష గోడలు బద్ధలు కొట్టేందుకు ఏటా కృషి చేస్తూనే ఉన్నారు.


ఇక ఈ ఏడాది(2023) థీమ్ ఏంటంటే “డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ”. భారత్ లో ఘనంగా వేడుకలు నిర్వహిస్తారు. మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుతారు. మహిళా సాధికారత, లింగ సమానత్వంలో సాధించిన విజయాల కోసం పోరాడిన నారీ మణులకు నారీ శక్తి పురస్కారాలు అందజేస్తారు. ఇటువంటివి భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేసేందుకు ఆదర్శంగా నిలబడతాయి.


Also Read: వీటిని నీటిలో వేసుకుని స్నానం చేశారంటే అదృష్టం మీ వెంటే, ఈ రోజే వీటిని ప్రయత్నించి చూడండి


మహిళా దినోత్సవం ఇలా మొదలైంది..


1909, ఫిబ్రవరి 28న న్యూయార్క్ లో సామాజిక కార్యకర్త మాల్కీల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగింది. అప్పుడే జాతీయ మహిళా దినోత్సవం జరపాలని నిర్ణయించుకున్నారు. అమెరికా జాతీయ మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చింది మాత్రం క్లారా జెట్కిన్. మహిళలందరినీ ఏకతాటి పైకి తీసుకురావడం కోసం అంతర్జాతీయ స్థాయిలో సమావేశం నిర్వహించగా 17 దేశాల నుంచి 100 మహిళలు వచ్చారు. అప్పుడే వాళ్ళు మహిళలకు ఒక రోజు ఉండాలని తీర్మానం తీసుకున్నారు. అలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. అమెరికాతో పాటూ డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల్లో తొలిసారి నిర్వహించారు. అంటే గత 122 ఏళ్లుగా మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. 


ఐక్యరాజ్య సమితి ప్రకటన


ఐక్యరాజ్య సమితి 1975 లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. మార్చి 8న జరుపుకోవాలని అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి అంతర్జాతీయంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుతూ మహిళ విజయాలను కొనియాడుతున్నారు.  


Also Read: ఈ సులభమైన టిప్స్ పాటించారంటే ఎండల్లో కూడా మెరిసిపోతూ అందంగా కనిపిస్తారు