కొందరు మతవిశ్వాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. జ్యోతిష్య శాస్త్రం, వాస్తు శాస్త్రాన్ని చాలా మంది నమ్ముతారు. ఆరోగ్యం, వృత్తి, సంపద, కుటుంబ క్షేమం కోసం పూజలు, యజ్ఞాలు చేస్తూ ఉంటారు. అదృష్టం ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. విజయం, డబ్బు, కీర్తి సాధించడంలో మరింత సహాయపడే అదృష్టాన్ని పొందటం కోసం ఎక్కువ మంది జ్యోతిష్యం నమ్ముతారు. చేతికి ఉంగరాలు ధరించడం, బ్యాగుల్లో అదృష్టం తీసుకొచ్చే వస్తువులు పెట్టుకుంటూ ఉంటారు. అవే కాదు ఇప్పుడు మీరు స్నానం చేసేటప్పుడు వీటిని నీళ్ళలో కలుపుకుంటే అదృష్టం మీ వెంటే అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అవేమీ ఖరీదైనవి ఏమీ కాదు చాలా సింపుల్ గా ఇంట్లో దొరికే వాటితోనే మీ అదృష్టాన్ని పెంచుకోవచ్చు.


పసుపు


భారతీయులు వంటకాల్లో ఉపయోగించే అత్యంత సాధారణ పదార్థం. భగవంతుడిని ఆరాధించడం దగ్గర నుంచి జలుబు తగ్గించే వరకు అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం స్నానం చేసే నీటిలో పసుపుని జోడించడం వల్ల అదృష్టం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పసుపులో శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి. శరీరం నుంచి ప్రతికూల శక్తులని తొలగిస్తుందని నమ్ముతారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు వేసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే మంచిది. అటు ఆరోగ్యంతో పాటు అదృష్టం కూడా మీ వెంటే ఉంటుంది.


గంధపు చెక్క


గంధం మంచి సువాసన ఇస్తుంది. మతపరమైన వేడుకలు, చర్మ సంరక్షణ, అరోమాథెరపీ సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. చందనం విజయం, సంపద, కీర్తిని తీసుకువస్తుందని నమ్ముతారు. గంధం నూనె లేదా గంధపు పొడిని స్నానం చేసే నీటిలో కలపడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. సానుకూలతను పెంచుతుంది. ఒంటికి చలువ చేస్తుందని నమ్ముతారు. వేసవి వాతావరణంలో ఈ నీళ్ళతో స్నానం చేస్తే శరీరం చల్లగా ఉంటుంది.


వేప


ఎన్నో గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్క వేప. దీన్ని సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో వేప శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగించి శుద్ధి చేసే ఏజెంట్ అని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో వేపను ఉపయోగించాలంటే గోరు వెచ్చని నీటిలో కొన్ని వేప ఆకులు లేదా పొడి వేసుకుని స్నానం చేయొచ్చు.


తులసి


ఎంతో పవిత్రమైన ఆకు తులసి. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయుర్వేదంలో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. శుద్ధి చేసే లక్షణాలని కలిగి ఉంటుంది. శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. తులసి వల్ల విజయం, శ్రేయస్సుతో ముడి పడి ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులు లేదా నూనె జోడించడం వల్ల ఒత్తిడిని తగ్గిస్తుంది. మనస్సుని శాంతపరిచి సానుకూలతను పెంపొందించేందుకు సహాయపడుతుంది.


గులాబీ రేకులు


గులాబీ రేకులు అద్భుతమైన సువాసన కలిగి ఉంటాయి. చర్మ సంరక్షణ ప్రయోజనాల కోసం ఎన్నో శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గులాబీ రేకులు ప్రేమ, ఆనందం, విజయం ఇస్తుందని నమ్ముతారు. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులను జోడించడం వల్ల ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. విశ్రాంతిని అందజేస్తుంది. మనసుకి హాయినిస్తుంది. 


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ముక్కు దిబ్బడకు నాసల్ స్ప్రే వాడుతున్నారా? ఈ ముప్పు తప్పదు!