జలుబు చేసినప్పుడు ముక్కు రంథ్రాలు బిగుసుకుని శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు చాలా మంది నాజల్ డ్రాప్స్ లేదా స్ప్రే చేసుకోవడం చేస్తారు. వాటి వల్ల తక్షణమే రిలీఫ్ వస్తుంది. కానీ ఇవి తీసుకోవడం వల్ల మూర్చ, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని ఒక నివేదిక వెల్లడించింది. సూడోఫెడ్రిన్ అనే డ్రగ్ కలిగి ఉన్న నాసికా డీకాంగెస్టెంట్‌లు పోస్టీరియర్ రివర్సిబుల్ ఎన్సెఫలోపతి సిండ్రోమ్ (PRES), రివర్సిబుల్ సెరిబ్రల్ వాసోకాన్‌స్ట్రిక్షన్ సిండ్రోమ్ (RCVS) ప్రమాదాన్ని కలిగిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డీకాంగెస్టెంట్‌ ముక్కు దిబ్బడను తగ్గిస్తాయి. బిగుసుకుపోయిన ముక్కుకి రిలీఫ్ అందిస్తాయి. ఈ వ్యాధులు రెండు చాలా అరుదైనవి. రివర్సిబుల్ పరిస్థితిలో ఉన్న చాలా మంది రోగులకు తగిన చికిత్స చేస్తే పూర్తిగా కోలుకుంటారు. ఇవి రెండూ మెదడుకి రక్తసరఫరా తగ్గడం వల్ల వస్తాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాంతక సమస్యలుగా కూడా మారతాయి.


ఈ వ్యాధుల లక్షణాలవి


తీవ్రమైన తలనొప్పి


వాంతులు


వికారం


మూర్చలు


ఆందోళనగా అనిపించడం


దృష్టి లోపం వంటి సమస్యలు


ముక్కు నుంచి రక్తం కారడం


శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది


ఒళ్ళు నొప్పులు


పైన చెప్పిన విధంగా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సూడోపెడ్రిన్ నాడులను ఉత్తేజపరిచే నోరాడ్రినలిన్ అనే రసాయనాన్ని విడుదల చేయడం ద్వారా పని చేస్తుంది. ఇది రక్తనాళాలు కుంచించుకుపోయేలా చేస్తుంది. నాళాల నుంచి విడుదలయ్యే ద్రవం మొత్తాన్ని తగ్గించేంస్తుంది. ఫలితంగా ముక్కులో వాపు, తక్కువ శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. ఇలా అవడం వల్ల ముక్కుకి రిలీఫ్ లభిస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా చేస్తుంది. మూసుకుపోయిన ముక్కు, సైనస్, జలుబు, ఫ్లూ లేదా ఇతర శ్వాస సంబంధిత వ్యాధుల వల్ల కలిగే నొప్పి నుంచి ఉపశమనం పొందటం కోసం సూడోపెడ్రిన్ ఉపయోగిస్తారు. చిన్న పిల్లలకు దీన్ని అసలు ఉపయోగించకూడదు.


అయితే దీన్ని అతిగా వినియోగించడం వల్ల PRES, RCVS వ్యాధులు వచ్చిన అరుదైన కేసులను నిపుణులు గుర్తించారు. సూడోపెడ్రిన్ కలిగిన మందులు గుండె, మెదడు రక్తనాళాల మీద ప్రభావం చూపిస్తాయి. రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడేలా చేస్తాయి. ఈ పరిస్థితిని ఇస్కీమియా అంటారు. అంటే శరీర భాగాలకు రక్తసరఫరా సరిగా కాకుండా నాళాలు కుంచించుకుపోవడం లేదా సన్నగా అయిపోవడం జరుగుతుంది. దాని వల్ల స్ట్రోక్, గుండె పోటుతో సహా ఆయా అవయవాలు పనిచేయడం కష్టం అవుతుంది. ఈ ప్రమాదాలని తగ్గించడం కోసం ఔషధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వైద్యుల సలహా తీసుకోవాలి. నిపుణుల సూచనలు లేకుండా సొంతంగా నాజల్ స్ప్రే, ముక్కుల్లో చుక్కలు, మందులు వేసుకోవడం చేయడం చాలా ప్రమాదకరం. దీని వల్ల ప్రాణాలు ప్రమాదంలో పడేసుకున్నట్టే అవుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: రోజూ తేనె, గోరువెచ్చని నీరు తాగుతున్నారా? లాభాలే కాదు నష్టాలూ ఉన్నాయ్!