Rahul Gandhi on Adani Row:


కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు..


కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాల్లో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌ జోడో యాత్ర గురించి ప్రస్తావించిన ఆయన...కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. అదానీ అంశంపైనా మాట్లాడారు. పార్లమెంట్‌లోనూ అదానీ అంశాన్ని ప్రస్తావించానని గుర్తు చేశారు. 


"పార్లమెంట్ సమావేశాల్లో అదానీ గురించి మాట్లాడాను. ఉన్నట్టుండి గౌతమ్ అదానీ అనే వ్యక్తి ప్రపంచంలోని ధనికుల్లో రెండో వాడిగా ఎలా ఎదిగారని ప్రశ్నించాను. దేశంలో మరెవ్వరికీ దక్కనన్ని లాభాలు అదానీకి మాత్రమే దక్కాయి. కేవలం ప్రధాని మోదీ, అదానీ మధ్య సంబంధం ఏంటి అని అడిగాను. బీజేపీ కార్యకర్తలు కూడా అదానీకి కొమ్ము కాస్తున్నారు. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహి అని ముద్ర వేస్తున్నారు. ఎవరూ అదానీ గురించి ప్రశ్నించే అవకాశమే లేకుండా చేస్తున్నారు. అయినా సరే. నిజమేంటో బయటకు వచ్చేంత వరకూ నేను ప్రశ్నిస్తూనే ఉంటాను" 


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత 


భారత్‌ జోడో యాత్రలో తనకు ఎదురైన అనుభవాలనూ పంచుకున్నారు రాహుల్ గాంధీ. ఈ యాత్ర ద్వారా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దక్కిందని వెల్లడించారు. 


"యాత్రలో నేను చాలా నేర్చుకున్నాను. దేశం కోసం కన్యా కుమారి నుంచి కశ్మీర్‌ వరకూ నడిచాను. వేలాది మంది మాతో కలిసి వచ్చారు. రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నాను. వాళ్ల బాధేంటో అర్థం చేసుకున్నాను. 52 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పటికీ నాకు సొంత ఇల్లంటూ లేదు. కానీ కశ్మీర్‌కు వెళ్లినప్పుడు సొంత ఇంటికి వెళ్లిన అనుభూతి కలిగింది. భారత్ జోడో యాత్రతో అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌తో ఇదే అనుభూతి వచ్చింది. యాత్రలో చాలా మంది ప్రజలు రాజకీయాల గురించి మాట్లాడలేదు. కానీ కశ్మీర్ ప్రజలు మాత్రం వీటి గురించే ప్రస్తావించారు. కశ్మీరీ యువతను దృష్టిలో పెట్టుకుని మూడు రంగుల జెండాను ఎగరేశాం. కానీ బీజేపీ దాన్ని తొలగించింది" 


- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత