బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ కు టైం అస్సలు కలిసి రావడం లేదు. వరుస పరాజయాలతో బాధపడుతున్న ఆయనకు మరో ఫ్లాప్ ఎదురయ్యింది. ఆయన నటించిన తాజా సినిమా ‘సెల్ఫీ’ సైతం బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. ఈ నెల 24న విడుదలైన ఈ చిత్రం ఓపెనింగ్ కలెక్షన్స్ రూ. 3 కోట్ల కంటే తక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్షయ్ కుమార్ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తనను తాను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఇలాంటి పరాజయాలు తనకు కొత్త కాదని చెప్పిన ఆయన, బాక్సాఫీస్ దగ్గర తన సినిమాల పరాజయానికి తప్పకుండా తానే బాధ్యత వహిస్తానని చెప్పారు.


కెరీర్ లో వరుసగా 16 ఫ్లాపులు ఎదుర్కొన్నా- అక్షయ్ కుమార్


"ఇలాంటి వరుస పరాజయాలు నాకు మొదటిసారి కాదు. నా కెరీర్‌లో వరుసగా 16 ఫ్లాప్‌లను ఎదుర్కొన్నాను. ఆ తర్వాత వరుసగా ఎనిమిది సినిమాలు అద్భుత విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు వరుసగా మూడు, నాలుగు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అసలు విషయం ఏంటే, ఇది సొంత తప్పిదం వల్లే జరుగుతోంది. సినిమా సక్సెస్ కావడం లేదంటే ప్రేక్షకులకు నచ్చడం లేదు. నచ్చేలా చేయక తప్పదు. అలా నచ్చేలా చేయాలంటే మమ్మల్ని మేం పూర్తిగా మార్చుకోవాలి. మళ్లీ కొత్తగా జర్నీ మొదలు పెట్టాలి” అని అక్షయ్ తెలిపారు.   


’’‘సెల్ఫీ’ ఫ్లాప్ తో డేంజర్ బెల్ మోగింది. మన సినిమాలు విజయం సాధించకపోతే మనదే తప్పు. ఇప్పుడు నేను మారడానికి ప్రయత్నిస్తున్నాను. ఇప్పుడు నేను చేయగలిగేది అదొక్కటే. సినిమాలు హిట్ కానప్పుడు ప్రేక్షకులను నిందించడం మానుకోవాలి. ఇది నా తప్పు. వందకు వంద శాతం నాదే తప్పు. మనం ఎంచుకున్న సినిమాలు సరిగా లేకపోవడం వల్లే వారికి నచ్చం లేదు. సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. మనం తప్పు చేసి ఎదుటి వారిని నిందించడం సరికాదు” అని అక్షయ్ అభిప్రాయపడ్డారు.  


కరోనా లాక్ డౌన్ తర్వాత వరుస ఫ్లాపులు


కరోనా లాక్ డౌన్ తర్వాత అక్షయ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ అందుకోవడం లేదు. కరోనా తర్వాత విడుదలైన  అక్షయ్ తొలి సినిమా ‘బెల్ బాటమ్’. ఆ తర్వాత  వచ్చిన ‘సూర్యవంశీ’ ఫర్వాలేదు అనిపించాయి. 2022 నుంచి థియేటర్లలో విడుదలైన అతడి చిత్రాలన్నీ పరాజయాన్ని చవి చూశాయి.  గతేడాది  విడుదల అయిన ‘రక్షా బంధన్’, ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ కూడా పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అతడి తాజా మూవీ ‘సెల్ఫీ’ సైతం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు.  ఫిబ్రవరి 24న విడుదలైన ఈ సినిమా మొదటి రోజు ₹3 కోట్ల కంటే తక్కువే కలెక్షన్లు సాధించి నిరాశపరిచింది.






Read Also: హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే బెస్ట్ - నసీరుద్దీన్ షా సెన్సేషనల్ కామెంట్స్!