ఎండాకాలం వచ్చేసింది. మధ్యాహ్నం 12 కాకముందే బయట మొహం పెడితే మాడిపోతుంది. అందుకే ఇటువంటి సమయంలో చర్మం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ప్రతి సీజన్ లో చర్మాన్ని సంరక్షించుకోవడం సవాలుతో కూడుకున్నది. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉండటం వల్ల వేడి, పొడి లేదా తేమతో కూడిన వాతావరణం చర్మాన్ని పలు విధాలుగా ప్రభావితం చేస్తుంది. అందుకే వేసవి చర్మ సంరక్షణ విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి.


తేలికపాటి మాయిశ్చరైజర్


వేసవిలో గాలి సాధారణంగా పొడిగా లేనప్పటికీ అనేక కారణాల వల్ల చర్మం ఇంకా పొడిబారిపోతుంది. అందుకే చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం తేలికపాటి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి. ఇది చర్మం మీద పగుళ్లు రాకుండా చేస్తుంది.


సన్ స్క్రీన్ తప్పనిసరి


ఎంత ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీసే వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవడం కోసం సన్ స్క్రీన్ రాసుకోవాలి. లేదంటే వృద్ధాప్య సంకేతాలు కనిపిస్తాయి. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. బయటకి వెళ్ళినప్పుడల్లా సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి. కనీసం SPF 30 ఉన్న దాన్ని కొనుగోలు చేసుకోవాలి. ఇది ఎండ వేడి నుంచి హాని కలగకుండా కాపాడుతుంది.


ఎక్స్ ఫోలియేట్


వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఎక్స్ ఫోలియేట్ చేయడం కూడా అవసరం. మృతకణాలని తొలగించి రంధ్రాలను అన్ లాగ్ చేయడానికి సహాయపడుతుంది. సున్నితమైన, తేలికైన ఎక్స్ ఫోలియెంట్ ఉపయోగించాలి. చర్మాన్ని శుభ్రం చేసుకునేటప్పుడు చికాకు లేకుండా ఉపశమనం కలిగిస్తుంది.


తేలికపాటి మేకప్ వేసుకోవాలి


వేడి వాతావరణం కాబట్టి మేకప్ తక్కువగా వేసుకోవడం మంచిది. లేదంటే చెమట వల్ల మేకప్ సులభంగా పోయే అవకాశం ఉంది. సీజన్ కు అనుగుణంగా ఉండే మేకప్ వేసుకోవాలి. మేకప్ తక్కువగా వేసుకోవడం వల్ల చర్మం ఊపిరి పీల్చుకుంటుంది. ఆక్సిజన్ సరఫరా సక్రమంగా జరుగుతుంది.


దుస్తుల విషయంలో జాగ్రత్త


చర్మ సంరక్షణ మాత్రమే సరిపోదు దుస్తులు కూడా సరైనవి ధరించాలి. హానికరమైన UV కిరణాల నుండి రక్షణ కోసం చర్మానికి చికాకు కలిగించని దుస్తులు వేసుకోవాలి. ఎండ నుంచి రక్షణ కలిగించడంలో దుస్తులు కీలక పాత్ర పోషిస్తాయి. డెనిమ్, వదులుగా ఉండే దుస్తులు, ముదురు రంగు దుస్తులు వేసుకోవడం మంచిది. కాటన్ వస్త్రాలు స్కిన్ ఫ్రెండ్లీ గా ఉంటాయి. చెమట వల్ల వచ్చే చికాకుని తగ్గిస్తాయి. ముఖాన్ని కప్పుకోవడం కోసం టోపీలు, గొడుగు ధరించడం ముఖ్యం. కళ్ళకు హాని కలగకుండా సన్ గ్లాసెస్ ధరించాలి.


ముఖం కడుక్కోవాలి


తీవ్రమైన వేసవిలో రిలాక్స్ గా ఉండటానికి, చెమట, ధూళిని శుభ్రం చేసుకోవడానికి ముఖాన్ని కడుక్కోవడం చాలా అవసరం. కానీ దీన్ని అతిగా చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇది చర్మానికి అవసరమైన సహజ తేమని తొలగిస్తుంది. శరీరం చర్మాన్ని రక్షించే సహజ తేమ మూలకాలని ఉత్పత్తి చేస్తుంది. తరచుగా మొహం కడగడం వల్ల చర్మం డీహైడ్రేట్ అవుతుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.


Also Read: ఈ టైమ్‌లో నిద్రపోతే ఆరోగ్యం గ్యారెంటీ - కానీ, మీకు కుదురుతుందా?