ప్రాసెస్ట్ ఫుడ్ అనే పదం తరచూ వింటుంటాం. వేటిని ప్రాసెస్ట్ ఫుడ్ అంటారో మొదట తెలుసుకుందాం. ఒక ఆహారపదార్థాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు యాంత్రిక, రసాయన మార్పులకు గురిచేస్తారు. మనకు సూపర్ మార్కెట్లలో దొరికే నూడిల్స్, బ్రెడ్, వెజ్ నగ్గెట్స్, చికెన్ నగ్గెట్స్, చాకోలెట్ బార్‌లు, కూల్ డ్రింక్స్, సూప్‌‌లు, కప్ కేకులు, చిప్స్, పాస్తాలు... ఇలా ఎక్కువ కాలం పాటూ నిల్వ ఉండేలా బాక్సుల్లో పెట్టి అమ్మేవన్నీ అత్యంతగా శుధ్ది చేసినవే. ఇవన్నీ మన ఆహారంలో భాగమైపోయాయి. ఆ ప్రాసెస్ట్ ఆహారం తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా నష్టాలు ఎదురవుతాయని ఓ కొత్త అధ్యయనంలో తేలింది. 


ప్రాసెస్ట్ ఆహారం అధికంగా తినేవారి మెదడులో ఇన్ ఫ్లమ్మేటరీ వంటి వాపు లక్షణాలు కనిపించాయి. ఇలాగే ఇలాంటి ఆహారం తీసుకోవడం కొనసాగితే వయసు పెరగినకొద్దీ మతిమరుపు వచ్చే సంకేతాలు కూడా పరిశోధనలో బయటపడ్డాయి. ఈ అధ్యయనాన్ని ఒహియో యూనివర్సిటీ వారు నిర్వహించారు. ఇందుకోసం కొన్ని పిల్ల ఎలుకలను, కొన్ని పెద్ద వయసు ఎలుకలను ఎంపిక చేసుకుని వాటికి మనుషులు తినే ప్రాసెస్ట్ ఆహారాన్ని తినిపించారు. ఇలా నాలుగు వారాల పాటూ  తినిపించాక వాటిలో వచ్చిన మార్పులను అంచనా వేశారు. ఇందులో పెద్ద వయసు ఎలుకల్లో ప్రవర్తనా పరమైన తేడాలు కనిపించాయి. ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గినట్టు తెలిసింది. అదే చిన్న వయసు ఎలుకల్లో మాత్రం ఇలాంటి మార్పులేవీ కనిపించలేదు. దీన్ని బట్టి పెద్ద వయసు వారు ప్రాసెస్ట్ ఆహారానికి దూరంగా ఉండడం చాలా మంచిదని సూచిస్తున్నారు. 


జ్ఞాపకశక్తి సమస్యలు రాకుండా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ప్రాసెస్ట్ ఆహారం వల్ల ఇబ్బంది పడిన ఎలుకలకు ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలున్న ఆహారాన్ని అందించారు పరిశోధకులు. కొన్నిరోజులకు మెదుడలోని వాపు లక్షణాలు తగ్గడంతో పాటూ, జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడింది. ఈ పరిశోధన గురించి ‘బ్రెయిన్, బిహేవియర్ అండ్ ఇమ్యునిటీ’ అనే జర్నల్‌లో ప్రచురించారు. 


ఇంకా ఎన్నో సమస్యలు...
ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం వంటివి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ పెరిగి గుండె సమస్యలు కూడా రావచ్చు. డిప్రెషన్ వంటి మానసిక రోగాలు కూడా దాడి చేయవచ్చు. 


ప్రాసెస్ట్ ఆహారం అమ్మే ప్యాకెట్లపై కొవ్వు తక్కువగా ఉన్నట్టు రాసి ఉంటుంది. కేవలం అది మాత్రమే చూసి కొనుక్కునే వారు ఎక్కువయ్యారు. వీటిలో ఫైబర్ కూడా ఉండదు, అధికంగా శుధ్ది చేయడం వల్ల తక్కువ నాణ్యత కలిగిన కార్బోహైడ్రేట్లు మాత్రమే ఉంటాయి. అంటే వీటి వల్ల అందే పోషకాలు కూడా నాణ్యమైనవి కాదు.  ఈ పరిశోధనకు నేషనల్ ఇనిస్టిట్యూల్ ఆన్ ఏజింగ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ అండ్ క్రానియోఫేషియల్ రీసెర్చ్ సంస్థలు కూడా తమ మద్దతును తెలిపాయి. 


ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.


Also read: బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన పద్దతులు చెబుతున్న ఆయుర్వేదం


Also read: బాగా బతకడమంటే ఎక్కువ సంపాదించడం కాదు, బాగా తినడం!


Also read: తరచూ కోపం వస్తోందా ? ఆ ఫీలింగ్ వెనుక కారణాలు ఇవి కావచ్చు



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి