Weight Loss Diet : బరువు తగ్గాలని, ఫిట్‌గా ఉండాలని చాలామంది డైటింగ్ చేస్తూ ఉంటారు. స్ట్రిక్ట్ డైట్ పాటించడం వల్ల ఆ సమయంలో మంచి ఫలితాలు కూడా చూస్తారు. అయితే డైటింగ్ చేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దానిలో జుట్టు రాలిపోవడం అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే డైటింగ్‌లో భాగంగా కొన్ని పోషకాలు జుట్టుకు సరిగ్గా అందవు. ఆ సమయంలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. బరువు తగ్గుతున్నామనే సంతోషం ఎలా ఉన్నాసరే.. జుట్టు రాలిపోతుందనే బాధ ఎక్కువైపోతూ ఉంటుంది.
బరువు తగ్గాలి అనుకోవడం అంత సులభమైనది ఏమి కాదు. పట్టుదల, సహనం, డెడికేషన్.. అన్నింటికన్నా ముఖ్యం సమయం కేటాయించడం చాలా అవసరం. ఇన్ని చేసినా సరే దానివల్ల కలిగే దుష్ప్రాభావాలు కూడా ఉంటాయి. మీరు తినే ఆహారం పైనే మీ జుట్టు ఆధారపడి ఉంటుందనే విషయం గుర్తించాలి. కాబట్టి డైట్ సమయంలో హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది. అయితే డైటింగ్ చేస్తూ కూడా.. జుట్టును సంరక్షించుకోగలిగే మార్గాలు ఏమైనా ఉన్నాయా?
సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు డైట్లో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలు చేర్చుకుంటారు. ఇది డైట్లో ఉన్నప్పుడు జుట్టు రాలడానికి ప్రధాన కారణం అవుతుంది. పోషకాల కొరత ఎక్కువయ్యే కొద్ది కొవ్వు తగ్గినా.. జుట్టు మాత్రం వీక్ అయిపోతుంది. ప్రోటీన్లు, క్యాలరీలు పరిమితం చేయడం వల్ల శరీరంలోని పోషకాలను కోల్పోతాము. ఇది జీవక్రియపై ప్రభావం చూపిస్తుంది. రక్తం, ఆక్సిజన్ జుట్టు కుదుళ్లకు చేరకుండా నిరోధిస్తుంది. దీనివల్ల జుట్టు బలహీనంగా మారి.. ఊడిపోతూ ఉంటుంది.
డైట్ పాటిస్తున్నప్పుడు ఫుడ్ పరిమితం చేస్తాము. ఇది మానసికంగా, శారీరకంగా ఒత్తిడిని కలిగిస్తుంది. బరువు తగ్గాలనే ఒత్తిడి తెలియకుండానే ఏర్పడుతుంది కాబట్టి స్ట్రెస్ ఎక్కువైపోతుంది. స్ట్రెస్ ఎక్కువైతే జుట్టు రాలిపోతుంది. ఎందుకంటే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి.. అది నేరుగా జుట్టు కుదుళ్లను ప్రభావితం చేస్తుంది. తక్కువ సమయంలో బరువు తగ్గిపోవాలనుకునేవారిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది.
దీనిని ఎలా అరికట్టాలంటే..
మీరు ఏ డైట్ ప్రారంభించినా.. ముందు వైద్యుడిని సంప్రదించాలి. వారి సూచనల ప్రకారం మీ శరీరానికి ఏమేమి పోషకాలు అందిచాలో వాటిని రెగ్యూలర్‌గా తీసుకోవాలి. కేలరీలను కంట్రోల్ చేయాలి కానీ.. వాటిని పూర్తిగా విస్మరించకూడదు. అలా చేస్తే ఒత్తిడి, అలసటకు గురవుతారు. కాబట్టి శరీరానికి క్రమం తప్పకుండా కొన్ని కేలరీలు అందిచాలి. ఇది మీకు శక్తిని ఇస్తుంది. నిర్థిష్ట పోషకాలను కచ్చితంగా తీసుకోవాలి.
ఒకేసారి బరువు తగ్గాలని చేసే ప్రయత్నాలు ఎప్పుడూ మంచిది కాదు. త్వరగా బరువు తగ్గిపోయినా.. అది దీర్ఘకాలంలో మీపై దుష్ప్రభావాలు, ఆరోగ్య సమస్యలు తీసుకువస్తుంది. మీ జుట్టుకు కూడా ఇది అస్సలు మంచిది కాదు. కాబట్టి.. నెమ్మదిగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల మీ జుట్టు పెరుగుదల కూడా మంచిగా ఉంటుంది.
డైట్లో ఉన్నప్పుడు జుట్టు రాలడం అనేది చాలా తాత్కలికమైన సమస్యగా తీసుకుంటే పర్లేదు. కానీ దానిని కూడా స్ట్రెస్‌గా తీసుకుంటే మాత్రం అది బరువు, జుట్టుపై నెగిటివ్ ఫలితాలను చూపిస్తుంది. డైట్ చేసుకుంటూ.. తలకు రక్తప్రసరణ అందించే వ్యాయామాలు, మసాజ్‌లు చేసుకుంటూ జుట్టును కాపాడుకోవచ్చు కూడా. లేదంటే వైద్యుని సూచనల మేరకు.. సప్లిమెంట్స్ కూడా తీసుకోవచ్చు.
Also Read : బరువు తగ్గడానికి రోజుకు రెండుసార్లు ఈ వ్యాయామాలు చేస్తే చాలట!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.