ఆధునిక కాలంలో ఒత్తిడి పెరిగిపోతోంది. స్క్రీన్ టైమ్ పెరగడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి వాటి వల్ల కంటిచూపు తక్కువ వయసులోనే మందగిస్తుంది. బలహీనమైన కంటి చూపు కలవారు కొన్ని రకాల ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది కంటికి ఆరోగ్యాన్ని అందించి కంటి చూపును కాపాడతాయి. 


1. చేపలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ముఖ్యంగా సాల్మన్ వంటి చేపలు తినాలి. చేపలలో ఒమెగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కంటి చూపుకు సహాయపడతాయి. కళ్లు పొడిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే రెటీనా భాగాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి.


2. బాదంపప్పులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలాన్ని ఉత్పత్తి చేస్తాయి. అస్థిర అణువుల నుండి మీ కళ్ళను కాపాడడంలో ముందుంటాయి. విటమిన్ E క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలు, మచ్చల క్షీణత, కంటి శుక్లాలు వంటి వాటి నుండి కళ్ళను రక్షిస్తాయి.


3. కోడిగుడ్లలో విటమిన్ A, లూటీన్, జియాక్సంతిన్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి కార్నియాను కాపాడడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. లూటీన్, జియాక్సంతిన్ తీవ్రమైన కంటి సమస్యలు రాకుండా చూస్తాయి. జింక్ రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుతుంది.


4. కంటికి ఆరోగ్యకరమైన ఆహారాల్లో క్యారెట్లు కూడా ఒకటి. వీటిలో విటమిన్ A, బీటా కెరాటిన్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి అవసరం. కంటి ఇన్ఫెక్షన్లు రాకుండా అడ్డుకోవడంలో ఇవి ముందుంటాయి. క్యారెట్లను సలాడ్లు, సూపులుగా మార్చుకొని తింటే మంచిది.


5. కాలే అనేది ఒక ఆకుపచ్చని ఆకుకూర. దీన్ని భారత దేశంలో కరమ్ సాగ్ అని పిలుస్తారు. కాలేలో యాంటీ ఆక్సిడెంట్లు లుటీన్, జియాక్సంతిన్ ఉంటాయి. ఈ రెండు మన శరీరంలో తయారు కావు. ఆహారం ద్వారానే తీసుకోవాలి. కాబట్టి కాలేను తినడం వల్ల ఈ రెండూ లభిస్తాయి. మీకు కాలే ఆకుకూర అందుబాటులో లేకపోతే పాలకూరను తినండి. పాలకూరలో కూడా లూటీన్ పుష్కలంగా ఉంటుంది. 


పైన చెప్పిన ఆహారాల్లో కనీసం రోజుకు ఒక పదార్థాన్నయినా తినాలి. ఇలా రోజుకో ఆహారాన్ని మెనూలో ఉండేలా చూసుకుంటే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. రోజుకో క్యారెట్ తిన్నా మంచిదే. రోజుకో ఉడకబెట్టిన కోడిగుడ్డు తినడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. చేపల్లాంటివి రోజూ వండుకోలేరు కాబట్టి వారానికి రెండు సార్లు తింటే చాలు.


Also read: పదేళ్ల వయసులో కలగంది, పంతొమ్మిదేళ్లకు ఆ కల నెరవేర్చుకుంది - మిస్ ఇండియా నందిని గుప్తా



Also read: కోవిడ్ వైరస్ పుట్టింది గబ్బిలాల్లో కాదు మనుషుల్లోనే, చైనీస్ శాస్త్రవేత్త కొత్త వాదన






























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.