డయాబెటిస్ వచ్చాక చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే ఆహారంలో, చేసే పనుల్లో, నిద్ర విషయంలో... ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటేనే అది అదుపులో ఉంటుంది. జంక్ ఫుడ్, తీపి పదార్థాలు వంటివి పూర్తిగా మానేయాలి. రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలు పెరిగితే మధుమేహం ముదిరిపోతుంది. అలా పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. మీరు తినే ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోవాలి. చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించుకోవాలి. మందులు వాడకుండా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవడం కొంచెం కష్టమే, కానీ ప్రయత్నిస్తే వీలవుతుంది. కాకపోతే దీని కోసం కాస్త కష్టపడాలి. ఒకసారి అదుపులోకి వస్తే ఈ పద్ధతులు పాటించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చూసుకోవచ్చు. కింద చెప్పిన నాలుగు పనులు చేస్తే చాలు... మీకు డయాబెటిస్ ఉన్నా కూడా ఇబ్బందులు కలగవు.
నాణ్యమైన నిద్ర
డయాబెటిస్‌కు, నిద్రకు చాలా అనుబంధం ఉంది. నిద్ర తగ్గినా కూడా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఒక్క రాత్రి సరిగా నిద్రపోకపోయినా ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వాలి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఒత్తిడి
ఒత్తిడి వల్ల అనేక వ్యాధులు, రోగాలు కలుగుతాయి. అలాగే మధుమేహం కూడా ఒత్తిడి కారణంగా అధికమయ్యే అవకాశం ఉంది. మీరు ఒత్తిడికి గురైతే మీ శరీరం ఉత్పత్తి చేసే హార్మోన్లు... రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదలకు కారణం అవుతాయి. కాబట్టి అధికంగా ఒత్తిడికి గురవ్వకుండా, ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. దీనివల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు.
ఫైబర్
మీరు తినే ఆహారంలో డైటరీ ఫైబర్ అంటే కరిగే ఫైబర్ అధికంగా ఉండేలా చూసుకోవాలి. ఇది మధుమేహం నియంత్రించడంలో చాలా సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ అధికంగా ఉండే పప్పులు, ఓట్స్, ఆపిల్ పండ్లలో ఉంటాయి. ఇవి చక్కెర స్థాయిలను నెమ్మదించేలా చేస్తాయి.
కూరగాయలు
మధుమేహం ఉన్నవారు ఏ కూరగాయలు తింటే మంచిది? అనే సందేహం చాలా మందికి ఉంది. మధుమేహం ఉన్నవారు తాజా కూరగాయలు ఏవైనా కూడా తినొచ్చు. విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉండే ఫైబర్ అధికంగా ఉన్న కూరగాయలను తినడం వల్ల మేలు జరుగుతుంది. అన్నాన్ని తగ్గించి కూరలు అధికంగా తినాలి. రోజులో కనీసం నాలుగు, ఐదు సార్లు కూరలు తినడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఒకేరకం కూరగాయ కాకుండా, రెండు మూడు రకాలు రోజుకు తినడం వల్ల చాలా మంచిది.
Also read: పెరుగుతున్న న్యూమోనియా కేసులు, దాన్ని గుర్తించడం ఎలా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.