Congestive Heart Failure : వేగంగా మారుతున్న జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడి, వివిధ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల వల్ల గుండె సమస్యలు (Causes of Heart Failure) పెరుగుతున్నాయి. అందుకే నేటికాలంలో హార్ట్ ఫెయిల్ అవడం అనేది కామన్ అయిపోయిందని అంటున్నారు నిపుణులు. వయసుతో సంబంధం లేకుండా వచ్చే ఈ సమస్యను తీవ్రమైనదిగా చెప్తున్నారు. ఇదివరకు ఈ వ్యాధి వృద్ధులకు మాత్రమే పరిమితం అని భావించేవాళ్లం. కానీ ఇప్పుడు యువకులు కూడా దీని బారిన పడుతున్నారు. అందుకే హార్ట్ హెల్త్​ని ఎవరూ తేలికగా తీసుకోకూడదని చెప్తున్నారు. అసలు హార్ట్ ఫెయిల్ అవ్వడం అంటే? అది రావడానికి కారణాలు ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు  ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

Continues below advertisement

హార్ట్ ఫెయిల్యూర్ (Heart Failure)

గుండె శరీరానికి రక్తాన్ని పంప్ చేస్తుంది. ఊపిరితిత్తుల్లోని కుడి భాగానికి రక్తాన్ని పంప్ చేసి.. ఎడమ భాగం నుంచి ఆక్సిజన్ కలిగి రక్తాన్ని మిగిలిన భాగాలకు పంపుతుంది. ఈ ప్రక్రియ సరిగ్గా జరగకుండా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడితే.. హార్ట్ బ్లడ్​ని పంప్ చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. దీనివల్ల శరీరానికి తగినంత ఆక్సిజన్ అందదు. దీనినే హార్ట్ ఫెయిల్ అంటారు. ఆ సమయంలో గుండె సంకోచించడం ఆగిపోతుంది. గుండె కండరాలు గట్టిగా పట్టేయడం లేదా బలహీనంగా మారిపోవడం (Heart Failure Risks) జరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. గుండె ఇలా ఫెయిల్ అయినప్పుడు శరీరంలోని ఇతర భాగాలకు రక్తసరఫరా ఆగిపోతుంది. వివిధ భాగాలలో, శరీర కణజాలంలో రక్తం, ద్రవం పేరుకుపోతుంది. అందుకే దీనిని కొన్ని సందర్భాల్లో కంజెస్టర్ హార్ట్ ఫెయిల్యూర్ (Congestive Heart Failure) అని కూడా అంటారు. 

లక్షణాలు (Heart Failure Symptoms)

హార్ట్ ఫెయిల్ అయినప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రారంభ దశ(Early Signs of Heart Problems)లో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ కాలక్రమేణా.. శ్వాసలో ఇబ్బంది, నీరసం, కాళ్లు లేదా పొత్తికడుపులో వాపు పెరుగుతుంది. 

Continues below advertisement

హార్ట్ ఫెయిల్యూర్ ప్రమాదం (Heart Disease in Young Adults) 

గుండె వైఫల్యం అనేది ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు. కానీ వృద్ధులలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి, అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం, ధూమపానం వంటి హార్ట్ ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాలుగా చెప్తారు. వీటివల్ల సమస్య నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది.

హార్ట్ ఫెయిల్ తర్వాత ఎక్కువకాలం జీవించవచ్చా? 

గుండె వైఫల్యం ఒక తీవ్రమైన పరిస్థితి. దానిని సకాలంలో గుర్తించి, సరైన చికిత్సతో తీసుకుంటే మీ లైఫ్​టైమ్ పెరుగుతుంది. కొన్ని పరిశోధనల ప్రకారం.. ఒక వ్యక్తి తన జీవనశైలిపై శ్రద్ధ వహిస్తూ.. సమయానికి వైద్యులు సూచించిన మందులు తీసుకుంటూ.. యాక్టివ్​గా ఉండేందుకు వ్యాయామం చేస్తూ లేదా ఇతర పనులు చేస్తూ ఉంటే.. హార్ట్ ఫెయిల్ అయినా చాలా సంవత్సరాలు సాధారణ జీవితాన్ని గడపవచ్చని తేల్చింది. గుండె వైఫల్యం అంటే గుండె ఆగిపోయిందని కాదని.. గుండెను మునుపటి కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందని సూచించే ఒక హెచ్చరిక అని నిపుణులు చెప్తున్నారు. 

గుండె వైఫల్యానికి చికిత్స (Treatment for Heart Failure)

గుండె వైఫల్యానికి చికిత్స ఉంది. సకాలంలో గుర్తిస్తే దాని ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. హార్ట్ ఫెయిల్ లక్షణాలను నియంత్రించి.. జీవన నాణ్యతను మెరుగుపరచడంపై వైద్యులు దృష్టి పెడతారు. ఈ చికిత్సలో మందులతో పాటు జీవనశైలిలో మార్పులు కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్తారు. గుండెపై ఒత్తిడిని తగ్గించే మందులను సూచిస్తారు. తీవ్రమైన పరిస్థితుల్లో గుండె మార్పిడి లేదా పేస్‌మేకర్ సిఫార్సు చేస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.