ఒకప్పుడు అరవైఏళ్లు దాటితేనే గుండె పోటు వస్తుందనే నమ్మకం ఉండేది, ఇప్పుడు వయసుతో సంబంధం లేదు గుండె జబ్బులు ఎప్పుడైనా దాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షుగర్ వ్యాధులు, హైబీపీ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవాళ్లలో గుండె పోటు వంటివి త్వరగా వచ్చే అవకాశం ఉంది.  అందుకే గుండె కోసం ప్రత్యేకంగా సంరక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆధునిక కాలంలో నీరసిస్తున్న గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు వ్యాయమంతో పాటూ ప్రత్యేకంగా కొన్ని ఆహారాలను తినాలి. 


1. అరటిపండు, కొబ్బరి నీళ్లను వీలైనంత తరచుగా తినాలి. వీటిల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. రక్తసరఫరాను మెరుగుపరిచేందుకు పొటాషియం చాలా అవసరం. బీపీని నియంత్రించడంలో కూడా ఇది కీలకం.కాబట్టి గుండె పోటు వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది.
2. గుండెను ఉక్కులా మార్చేందుకు రోజు వారీ ఆహారంలో ఆకుకూరలు, తాజా కూరగాయలు, తృణ ధాన్యాలను భాగం చేసుకోవాలి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 
3. గుండెకు ఒమెగా3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం తినడం చాలా అవసరం.ఇవి గుండె వ్యాధులను దాదాపు పాతిక శాతం మేర తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే చేపలు, బాదం పప్పులు, అవిసె గింజల్లాంటివి తరచూ తినాలి. గుండెకు బలాన్నివ్వడంలో ఇవి ముందుంటాయి. 
4. పచ్చి బఠానీలు ఈ కాలంలో పుష్కలంగా దొరుకుతాయి.వీటిని ప్రతి రెండు రోజులకోసారి తింటూ ఉంటాలి. కూరల్లో భాగం చేసుకుని వండుకోవచ్చు. 
5. బీన్స్, పప్పుల్లో కూడా ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. ఇవి గుండెను కాపాడేందుకు సహకరిస్తాయి. 
6. రాగులు, కొర్రలు,సామలు వంటివి కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. మధుమేహం ఉన్న వారికి కూడా ఇవి మేలు చేస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహకరిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ చేరకపోతే గుండె  పోటు రావడం కూడా తగ్గుతుంది. 
7. ఆహారం విషయంలోనే కాదు వ్యాయామంపై కూడా శ్రద్ధ వహించాలి. రోజూ కనీసం ఒక గంట పాటూ నడవాలి. నడక గుండెకు మేలు చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ జిమ్ లో అధికంగా గడపడం తగ్గించాలి. రన్నింగ్, జాగింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలు చాలు. 


గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.


Also read: పొట్టలో టీ గ్లాసు, ఎలా మింగేశావయ్య బాబూ అంటూ తల పట్టుకున్న వైద్యులు


Also read: శాకాహారుల కోసం టేస్టీ వెజ్ ఖీమా, రుచే కాదు పోషకాలు పుష్కలం